31 C
Hyderabad
Monday, June 9, 2025
spot_img

రష్యా – ఉక్రెయిన్ యుద్ధానికి మూడేళ్లు

ఉక్రెయిన్ పై రష్యా సైనిక దాడులు మొదలెట్టి మూడేళ్లు పూర్తయ్యాయి. ఇప్పటికీ యుద్ధం కొనసాగుతూనే ఉంది. రష్యా – ఉక్రెయిన్ యుద్ధాన్ని విశ్లేషిస్తే, బైడెన్ హయంలో ఆ తరువాత ట్రంప్ హయాంలో అని విభజించుకోవాల్సి ఉంటుంది. అమెరికా అధ్యక్షుడి గా జో బైడెన్ ఉన్నంతకాలం ఉక్రెయిన్ కు అండగా నిలబడింది. ఉక్రెయిన్ సేనలకు మద్దతుగా యుద్ధరంగంలోకి దిగకపోయినా, ఆ దేశానికి నైతిక మద్దతు ఇచ్చింది అమెరికా. అంతేకాదు ఉక్రెయిన్ కు భారీ ఎత్తున ఆర్థిక సాయం చేసింది. బిలియన్ల కొద్దీ డాలర్లను ఉక్రెయిన్ కోసం కుమ్మరించింది. అమెరికాను చూసి యూరోపియన్ దేశాలు కూడా ఉక్రెయిన్ దేశానికి సాయం చేయడానికి ముందుకు వచ్చాయి. ఉక్రెయిన్ అధినేత జెలెన్‌స్కీ అన్ని యూరోపియన్ దేశాల్లో అలా ఓ రౌండ్ వేశారో లేదా అత్యంత అధునాతన ఆయుధాలు అందచేశాయి. ఇటు అమెరికా డాలర్లు అటు యూరోపియన్ దేశాల అధునాతన ఆయుధాలతో యుద్ధరంగంలో నిలబడింది ఉక్రెయిన్. ఒక దశలో రష్యా ఆత్మరక్షణలో పడితే, ఉక్రెయిన్ అఫెన్స్ లో ఉంది.

డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక …అసలు యుద్దానికి సంబంధించిన డైనమిక్స్ మారిపోయాయి. అమెరికా అధ్యక్షుడిగా తాను ఎన్నికైతే, 24 గంటల్లో రష్యా – ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేలా చేస్తానని ఎన్నికల ప్రచారం సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ చెప్పడం చాలామందికి గుర్తుండే ఉంటుంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టి కూడా నెల రోజులు దాటుతోంది. అయితే ఇప్పటికీ రష్యా – ఉక్రెయిన్ యుద్ధానికి ఎండ్ కార్డ్ పడలేదు. దీనికి కారణం యుద్ధానికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వైఖరే అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

యుద్ధాన్ని ముగించడంలో భాగంగా నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన డొనాల్డ్ ట్రంప్ అందుకు భిన్నమైన వైఖరి అవలంబించారు. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ను పూర్తిగా వెనుకేసుకొచ్చారు. అసలు మొత్తం యుద్ధానికి బాధ్యుడిగా ఉక్రెయిన్ అధినేత జెలెన్‌ స్కీని ప్రపంచం ముందు నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఒకపక్క యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లోని అనేక నగరాలు స్మశానాలను తలపిస్తుంటే, ఆ దేశంలో ఎన్నికలు నిర్వహించడానికి జెలెన్‌ స్కీ వ్యతిరేకమంటూ ఊరూవాడా ఏకం చేసి మరీ ప్రచారం చేశారు. అసలు గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తీసుకువచ్చాడని జెలెన్‌స్కీని తూర్పారపట్టారు డొనాల్డ్ ట్రంప్. కథ అక్కడితో ఆగలేదు…జెలెన్ స్కీ వృత్తి అయిన కామెడీని కూడా తెరమీదకు తీసుకువచ్చాడు. జెలెన్ స్కీ, సీరియస్ గా పట్టించుకోదగ్గ దేశాధినేత కాడని, కేవలం ఒక విదూకుడని ఎద్దేవా చేశారు ట్రంప్ మహాశయుడు.

డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు జెలెన్ స్కీ బాగా నొచ్చుకున్నట్లున్నారు. యుద్ధానికి ఎండ్ కార్డ్ పడుతుందంటే…తాను అధ్యక్షు పదవి నుంచి దిగిపోవడానికి కూడా సిద్దమేనంటూ సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్ లో శాంతి మినహా తనకు మరేదీ ముఖ్యం కాదని కుండబద్దలు కొట్టారు జెలెన్ స్కీ. తనను విమర్శించడాన్ని పక్కన పెట్టి యుద్ధాన్ని పరిసమాప్తి చేయడానికి ట్రంప్ మరింత సీరియస్ గా ప్రయత్నిస్తే మంచిదన్నారు జెలెన్ స్కీ.

ఇదిలా ఉంటే, జో బైడెన్ హయాంలో ఆర్థిక సాయం కింద ఉక్రెయిన్ కు అమెరికా భారీ ఎత్తున డాలర్లు అందచేసింది. ఇలా ఉక్రెయిన్ కు అందచేసిన డాలర్లను తిరిగి తీసుకోవాలని ట్రంప్ తహతహలాడుతున్నారు. ఇందులో భాగంగా ఉక్రెయిన్ ముందు ఖనిజాల కు సంబంధించిన ఒక ఒప్పందాన్ని ట్రంప్ ఉంచారు. ఈ ఒప్పందం ద్వారా ఉక్రెయిన్ నుంచి తిరిగి డాలర్లను రాబట్టుకోవాలన్నది ట్రంప్ మహాశయుడి ప్లాన్ గా తెలుస్తోంది.ఇదిలా ఉంటే, శాంతి చర్చల నుంచి జెలెన్ స్కీని పక్కన పెట్టారన్న ఆరోపణలను రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ తోసిపుచ్చారు. ఉక్రెయిన్ లో శాంతిని కోరుకుంటే, అందుకు సంబంధించిన చర్చలను జరగనివ్వండి అంటూ జెలెన్‌స్కీని ఉద్దేశించి పుతిన్ వ్యాఖ్యానించారు.

కాగా మూడేళ్ల నుంచి జరుగుతున్న యుద్ధంలో అటు రష్యా ఇటు ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయాయి. లక్షల సంఖ్యలో ఉభయదేశాలకు చెందిన సైనికులు మరణించారు. మొదట్లో ఇరుదేశాల మధ్య సాగిన మాటల యుద్ధం, ఒకదశలో అణు యుద్ధం వస్తుందా అనే భయాందోళనలకు దారితీసింది. అయితే, ఈ విషయంలో రెండు దేశాలు సంయమనంతో వ్యవహరించాయి. దీంతో అణు యుద్ధం తప్పిపోయింది. కాగా ఉక్రెయిన్ లోని నాలుగో వంతు భూభాగాలను రష్యా స్వాధీనం చేసుకుంది. ఆ భూభాగాల్లోని ప్రజలంతా ఇప్పటికీ రష్యా అధీనంలో కొనసాగుతున్నారు. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించుకుని తీరాలి. రష్యా – ఉక్రెయన్ యుద్ధం పరిసమాప్తి చేసే ప్రక్రియలో యూరోపియన్ దేశాలను ట్రంప్ దూరం పెట్టారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం యూరప్ దేశాల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిందనే చెప్పాలి. నిన్న మొన్నటివరకు అమెరికా అడుగు జాడల్లో నడిచిన యూరోపియన్ దేశాలు, భవిష్యత్తులో ఎటువంటి వైఖరి అవలంబిస్తాయన్నది ప్రశ్నగా మారింది. ఏమైనా, ట్రంప్ హయాంలో….అమెరికాకు, యూరోప్ కు మధ్య దూరం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

2022 ఫిబ్రవరి 24 ….. ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడులు మొద‌లు పెట్టిన రోజు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడులు ప్రారంభించి మూడేళ్లు దాటింది. ఉక్రెయిన్‌పై సైనిక దాడులు ప్రారంభించిన తొలిరోజుల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ దూకుడు మీద ఉన్నాడు. ఈ యుద్దంలో ప్రపంచ దేశాలేవీ జోక్యం చేసుకోకూడదని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. తన మాటను కాదని ఏ దేశమైనా జోక్యం చేసుకుంటూ తీవ్ర పరిణామాలు సంభవిస్తాయని పుతిన్ హెచ్చరించాడు కూడా . సహజంగా ఉక్రెయిన్‌కు అమెరికాతో మంచి సంబంధాలున్నాయి. దీంతో అమెరికా జోక్యాన్ని కూడా నివారించడానికి ఈ ఎపిసోడ్‌లో మూడో దేశం ఎంట్రీని ఆయన తోసిపుచ్చారు. పరోక్షంగా అమెరికాకు పుతిన్‌ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పనిలోపనిగా అమెరికాతో పాటు నాటో కూటమి దేశాలకు కూడా పుతిన్ హెచ్చరికలు జారీ చేశారు. పుతిన్ మనస్తత్వం అందరికీ తెలిసిందే. దీంతో అమెరికా సహా ప్రపంచదేశాలేవీ ఉక్రెయిన్ యుద్దంలో జోక్యం చేసుకోలేదు. ఒక దశలో జెలెన్ స్కీ అభ్యర్థన మేరకు అమెరికాతో పాటు అనేక యూరోపియన్ దేశాలు అయుధాలు మాత్రం అందచేశాయి.

కాగా రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం అనేక దేశాలపై పడింది. ప్రధానంగా అనేక యూరోపియన్ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. కాగా ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడులు మొదలు పెట్టడంతో నాటో కూటమి తీవ్ర ఆగ్రహానికి గురైంది. నాటో కూటమి అంటే అగ్రరాజ్యమైన అమెరికా కనుసన్నట్లో నడిచే కూటమే. దీంతో రష్యాపై నాటో కూటమిలోని అనేక దేశాలు ఆంక్షలు విధించాయి. ఇదిలా ఉంటే తమకు వ్యతిరేకంగా ఆంక్షలు విధించడంతో రష్యా మండిపడింది. అప్పటివరకు అనేక పశ్చిమ దేశాలకు రష్యా నుంచి చమురు సరఫరా అయ్యేది. ఇందుకు ప్రతిగా ఆయా పశ్చిమ దేశాలకు రష్యా చమురు సరఫరా నిలిపివేసింది. అంతిమంగా అనేక ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు తల్లకిందులయ్యాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్