ఆరోగ్యంగా ఉండటానికి శారీరక శ్రమ అవసరం. కానీ ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఒక వ్యక్తి ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి అతని ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఫలితంగా అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. పెరిగిన బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఆహారంలో మార్పులు చేసుకుంటే.. మరికొందరు జిమ్‌లు చుట్టూ తిరుగుతున్నారు. అయితే బరువు తగ్గటానికి నడకే ఒక మంచి ఆప్షన్ అని మీకు తెలుసా?
ఆరోగ్యం కోసం చాలామందికి వ్యాయామం చేయాలని ఉన్నప్పటికీ, బిజీ షెడ్యూల్‌లు, గంటల తరబడి ఆఫీసు వేళల కారణంగా, ఎంతోమంది వ్యాయామం కోసం సమయం కేటాయించలేకపోతున్నారు. నిజానికి వ్యాయామం కోసం ప్రత్యేకంగా జిమ్‌లో చేరటం, భారీ వర్కౌట్లు చేయాల్సిన అవసరం లేదు. మనల్ని మనం ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సహాయపడే సాధారణ కార్యక్రమం ఒకటి ఉంది. అదే నడక.
కదలకుండా కూర్చోవటం, శారీరిక శ్రమ చేయకపోవటం వంటివి బరువు పెరగడానికి మాత్రమే కాదు , ఇతర అనేక అనారోగ్య సమస్యలకు కారణమని మనందరికీ తెలుసు. అయితే మనం నడకను మాత్రం ఒక వ్యాయామం కాదు అనుకుంటారు. కానీ, కొవ్వును కరిగించడానికి నడక చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుందని అనేక అధ్యయనాలు నిర్ధారించాయి. నడక కండరాలు, ఎముకలను బలోపేతం చేస్తుంది, రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది, రక్తపోటును నియంతిస్తుంది, తద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.
చాలా మంది చెబుతారు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ శరీరంలో మార్పు కనిపించడం లేదు. బరువు తగ్గలేకపోతున్నాము అని. కానీ నిజానికి వారు రకరకాల ప్రయత్నాలు చేసి ఉంటారు గానీ సులువుగా చేయగలిగే వ్యాయామాన్ని పక్కన పెట్టేసి ఉంటారు. అదే వాకింగ్. అయితే దీనికి ఒక పద్దతి ఉంది. అసలు నడక వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? రోజుకు ఎంత దూరం నడిస్తే గణనీయంగా వేగం తగ్గుతారు, అసలు బరువు తగ్గేందుకు వాకింగ్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును కరిగించుకోవడానికి ప్రతిరోజూ ఉదయాన్నే ప్రతిరోజూ 30 నుండి 45 నిమిషాలు నడవాలి. ప్రతిరోజూ దాదాపు అరగంట పాటు వేగంగా నడవడం ద్వారా, సులభంగా బరువు తగ్గుతారు. అయితే మొదటి రోజు అంత సేపు నడవటం అంత మంచిది కాదు. ప్రారంభంలో అంత సమయం నడక మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది. కాబట్టి మొదట 15 నిమిషాల మార్నింగ్ వాక్ తో ప్రారంభించి క్రమంగా అర్థగంట సేపు నడవడం అలవాటు చేసుకోవాలి. ఇలా ప్రతి రోజు చేస్తే ఒక నెలలోనే మీలో మార్పు కనిపిస్తుంది. అయితే, కేవలం ఒకటి రెండు రోజులు వాకింగ్ వెళితే మాత్రం ప్రయోజనం ఉండదు. వాకింగ్ వల్ల శరీరంలో మార్పు రావాలంటే వాకింగ్ కు రెగ్యులర్ గా వెళ్లాలని నిపుణులు చెబుతున్నారు.
మార్నింగ్ వాకింగ్ చేస్తే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. నడక శరీరంలోని జీవక్రియను పెంచుతుంది. మనసుకు విశ్రాంతినిస్తుంది. నడక ద్వారా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే డయాబెటిక్ రోగులకు వైద్యులు వాకింగ్ చేయాలని సూచిస్తారు. రక్తపోటును నియంత్రించడానికి కూడా వాకింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వాకింగ్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఎముకల దృఢత్వం, కీళ్ల ఆరోగ్యం మెరుగుపడతాయి. అందుకే ప్రతి ఒక్కరూ నడకను ఒక పద్ధతిలో అలవాటు చేసుకోవాలి.
అయితే ఒక రోజులో ఎన్ని అడుగులు నడవాలి అన్నది మరో ప్రశ్న. ఆరోగ్యంగా ఉన్న ఒక వ్యక్తి రోజుకు 10వేల అడుగులు నడవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 10 వేల అడుగులు అంటే దాదాపు 7 నుండి 8 కిలోమీటర్ల దూరానికి సమానం. అయితే.. ఇది వ్యక్తి వయస్సు, ఆరోగ్యం, ఫిట్‌నెస్ స్థాయి, నడక సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. నడక మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అలా అని మొదటి రోజే పది వేల అడుగులు నడిచి శరీరంపై ఎక్కువ ఒత్తిడిని పెట్టొద్దు. ప్రారంభంలో 5000 నుండి 7000 అడుగులను లక్ష్యంగా పెట్టుకోవాలి. దశల వారిగా సంఖ్యను పెంచుకుంటూ పోవాలి. అయితే వృద్ధులు మాత్రం 4000 నుండి 6000 అడుగులు నడిస్తే వారి ఆరోగ్యానికి మంచిది. ఎవరికీ వారు వారి శారీరక సామర్థ్యానికి తగ్గట్టుగా నడవాలి.
బరువు తగ్గడం లేదా ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో వాకింగ్ చేసేవారు 12 వేల నుండి 15 వేల అడుగులు నడవడానికి ప్రయత్నించాలి. బరువు తగ్గడానికి, ఉదయం 30 నిమిషాలు నడవండి. తీరికగా నడుస్తున్నప్పుడు కంటే వేగంగా నడిచేటప్పుడు మీరు ఎక్కువ కేలరీలు బర్న్ చేయవచ్చు. అలాగే క్రమం తప్పకుండా ఎత్తుపైకి నడవడం వల్ల అదనపు కొవ్వు కరిగిపోతుంది. అలాగే పవర్ వాక్ చెయ్యండి. పవర్ వాక్ అంటే క్రమం తప్పకుండా అనుసరించగల అధిక-తీవ్రత కలిగిన నడక. మొదటగా సుమారు 5-10 నిమిషాలు శక్తివంతమైన నడకతో ప్రారంభించండి. తరువాత నడక వేగాన్ని 15-20 సెకన్ల పాటు పెంచండి. శక్తివంతంగా, వేగంగా నడవండి కానీ పరుగెత్తకండి. ఒక అర నిమిషం పాటు ఇలా నడిచిన తర్వాత మళ్ళీ సాధారణ వేగానికి తిరిగి వెళ్లండి. మధ్యమధ్యలో ఇదే పని పునరావృతం చేస్తూ ఉండండి. అయితే ఏం చేసినా ఎలా చేసినా మీ శక్తి స్థాయిలను కూడా దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎప్పుడైనా అలసిపోయేలా, ఆయాస పడేలా నడవడం కూడా మంచిది కాదు.