తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మరోసారి మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా, సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసిందని అన్నారు. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలు మోసమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. మెదక్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అశోక్ నగర్‌లో రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి నిరుద్యోగులకు హామీ ఇచ్చారన్నారు. 14 నెలలు అయినా వారి గురించి కానీ, జాబ్ క్యాలెండర్ గురించి పట్టించుకోవడం లేదని చెప్పారు.
తెలంగాణ ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందని కేంద్రమంత్రి అన్నారు. ఉద్యోగులకు జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, DAలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందన్నారు. మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. మారింది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి కానీ తెలంగాణ పరిస్థితి మారలేదని ఎద్దేవా చేశారు. బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ ఆయన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చుకున్నారన్నారు. నేడు రేవంత్ కూడా కేసీఆర్ లానే వ్యవహరిస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు.
తెలంగాణలో అభివృద్ధి పనులు అన్ని కుంటుపడ్డాయని కిషన్‌రెడ్డి అన్నారు. సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి..ప్రకటనలు ముందు పేజీలో ఉన్నాయి పనులు మాత్రం లేవని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ మంత్రుల మధ్య సమన్వయం లేదని ఆరోపణలు చేశారు. శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అవినీతి బాగా పెరిగిందని చెప్పారు.
హిమాచల్ ప్రదేశ్‌లో కరెంట్ బిల్లులు కట్టలేక, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని తెలిపారు.. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు అమలు కావడం లేదు. బీజేపీపాలిత రాష్టాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ సమర్థవంతంగా పని చేస్తూంది. తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రజా పోరాటాలకు సిద్ధమవుతామని కిషన్‌రెడ్డి వెల్లడించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని కిషన్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలు తెలంగాణకి దశ దిశ నిర్దేశిస్తాయని తెలిపారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పుల రాష్ట్రం అయిందన్నారు.
కేసీఆర్‌కు అహంకారం పెరిగిందని చెప్పి కాంగ్రెస్ నేతలు అధికారంలో వచ్చారని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ 14 నెలలు కావస్తున్నా ఏ పనులు చేయట్లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. ఇచ్చిన ఏ హామీ కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదన్నారు. ఉద్యోగాలు ఇస్తామని యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మాట తప్పిందని కేంద్రమంత్రి విమర్శించారు.