పార్లమెంట్ ఎన్నికల వేళ.. పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ లో తిరుగుబాటు మొదలైంది. మమతా బెనర్జీ సోదరుడు బబున్ బెనర్జీ TMC సభ్యుల ఎంపికలో మమతా బెనర్జీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. హౌరా లోక్ సభ స్థానానికి టీఎంసీ అభ్యర్థిగా ప్రసూన్ బెనర్జీ ఎంపికను తప్పుపట్టారు. ఆ అభ్యర్థిని మార్చని పక్షంలో తానే ఇండిపెండెం ట్ గా హౌరా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. దాంతో మమతా బెనర్జీ.. బబున్ బెనర్జీని పార్టీ కార్యకలాపాలనుంచి దూరం పెట్టారు. బబూన్ బెనర్జీతో అన్ని సంబంధాలను తెంచుకుంటున్నట్లు మమత ప్రకటించారు. బబున్ ఇప్పుడు తన తమ్ముడు కాదని, తనకు అత్యాశపరులంటే ఇష్టం లేదు అంటూ మమతా బెనర్జి ప్రకటించారు.
మమత ఐదుగురు సోదరుల్లో బబున్ బెనర్జీ ఆఖరివాడు. తమ కుటుంబంలో 32 మంది ఉన్నారని, బబున్ మాదిరి ఎవరూ లేరని.. అతడి విషయంలో తాను అసంతృప్తితో ఉన్నానని మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమన్నారు.పశ్చిమ బెంగాల్ హౌరా లోక్ సభ స్థానం నుంచి మమతా బెనర్జీ పార్టీ అధికార అభ్యర్థిగా ప్రసూన్ బెనర్జీని ఎంపిక చేయడం పట్ల ఆమె సోదరుడు బబున్ బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రసూన్ బెనర్జీ సరైన అభ్యర్థికాడని ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న బబున్ బెనర్జీ అన్నాడు. చాలా మంది సమర్థులైన అభ్యర్థులను పక్కన పెట్టారన్నారు. ప్రసూన్ బెనర్జీ తనకు చేసిన అవమానాన్ని మరచి పోలేదన్నారు. మమత తన సూచనను అంగీకరించని పక్షంలో కచ్చితం గా హౌరా నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానన్నారు. తాను బీజేపీలో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని బబున్ బెనర్జీ కొట్టివేశారు.


