అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను విజయం సాధించి అధికారంలోకి వస్తే దేశంలో సరికొత్త ఆర్థిక అద్భుతాన్ని సృష్టిస్తానన్నారు. మిచిగాన్‌లోని డెట్రాయిట్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో డెమోక్రాటిక్ అభ్యర్థి కమలాహారిస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్థిక విధానాల్లో కమలా హారిస్ పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు. ఆమె విధానాల వల్లే ప్రైవేటు రంగంలో 30 వేల ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోయాయన్నారు. తయారీ రంగంలోనూ దాదాపు 50వేల ఉద్యోగాలు కోల్పోయామని చెప్పారు. హారిస్ అధికారంలోకి వస్తే ఆర్థికవ్యవస్థ విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
దేశ సమస్యలే కాకుండా ప్రపంచ దేశాల పరిస్థితులను నిరంతరం గమనిస్తుంటానని ట్రంప్ అన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను నివారించడానికి, రష్యా- ఉక్రెయిన్‌కు మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నిస్తానని అన్నారు. మూడో ప్రపంచ యుద్ధం రాకుండా నిరోధిస్తానని హామీ ఇచ్చారు. అమెరికా సైన్యాన్ని బలోపేతం చేయడానికి, ఆధునికీకరించడానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.