హైదరాబాద్ సూరారం పీఎస్ పరిధిలో ఓ దొంగ పోలీసులకు చుక్కలు చూపించాడు. దొంగతనం చేసి పారిపోయే క్రమంలో చెరువులో దాక్కుని ముప్పతిప్పలు పెట్టాడు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లోకి చొరబడిన దొంగ ఇల్లు గుల్ల చేసేందుకు ప్రయత్నించాడు. అంతలోనే ఇంటి ఓనర్ రావడంతో తప్పించుకునే క్రమంలో దొంగ చెరువులోకి దూకాడు. ఈదుకుంటూ వెళ్లి చెరువు మధ్యలో ఉన్న బండరాయిపై కూర్చున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అతనిని బయటకు రప్పించే ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. చెరువులోకి దూకిన దొంగ కళ్ల ముందే కనిపిస్తున్నప్పటికీ ఎలా పట్టుకోవాలో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా ఆ దొంగ బయటకు రాలేదు. చీకటి పడుతున్నా దొంగ మాత్రం చెరువులోనే ఉండిపోయాడు. నిన్న సాయంత్రం నుంచి పోలీసులు దొంగను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. చివరకు పోలీసుల కళ్లు గప్పి సదరు దొంగ బయటకొచ్చాడు.