తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ.. ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. జనసేనతో ఇక పొత్తులు ఉండవని వెల్లడించారు. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు. సర్వేలకు అందని విధంగా లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఫలితాలను సాధిస్తుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పొత్తు వల్ల జనసేన, బీజేపీలకు కూడా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేలు జరగలేదు. జనసేన పోటీ చేసిన ఎనిమిది చోట్ల బీజేపీ కార్యకర్తలు ఆ పార్టీకి మద్దతు ఇవ్వనట్లు విశ్లేషకులు చెబుతున్నారు. సంప్రదాయ బీజేపీ ఓటు బ్యాంక్ కూడా జనసేనకు అనుకూలంగా పనిచేయలేదని అంటున్నారు. ఈ కారణం వల్లే వచ్చే లోక్‌సభ పోల్స్‌లో ఒంటరిగా బరిలోకి దిగుతామని కిషన్ రెడ్డి ప్రకటించి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొదట జనసేన పోటీ చేస్తుందని గానీ.. ఆ పార్టీతో పొత్తు ఉంటుందని గానీ.. బీజేపీ లీడర్లు అనుకోలేదు. కానీ 32 స్థానాల్లో తమ అభ్యర్థులను దించుతున్నామని, లిస్ట్ రెడీ అవుతోందని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రకటించారు. దాంతో బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ పవన్‌ను కలిసి రాయబారం చేశారు. బేరాలు ఆడుకొని చివరకు జనసేనకు 8 సీట్లు ఇస్తామని ప్రకటించారు. సీమాంధ్రుల ప్రభావం ఉంటుందని భావించిన హైదరాబాద్‌తో పాటు, ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఈ సీట్లు కేటాయించారు. ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాతో కలిసి పవన్ కల్యాణ్.. బీజేపీ ఎన్నికల ప్రచార సభల్లో కూడా పాల్గొన్నారు. పవన్ ఇమేజ్ తమకు కలిసి వస్తుందని కమలం పార్టీ నేతలు భావించారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు రిలీజ్ అయ్యాక సీన్ మారిపోయింది. జనసేన పోటీచేసిన 8 స్థానాల్లో బీజేపీ అభిమానులు, కార్యకర్తలు ఓట్లే వేయలేదని తేలింది. గతంలో బీజేపీకి భారీగా ఓట్లు పడిన చోట కూడా జనసేనను జనం ఆదరించలేదు. ఈ పరిస్థితుల్లోనే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని కిషన్ రెడ్డి చెప్పారని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.
మరోవైపు తెలంగాణలో కేవలం 17 లోక్‌సభ స్థానాలు మాత్రమే ఉండడంతో వాటిని జనసేనతో పంచుకోవడానికి బీజేపీ ఇష్టపడటం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లోనే డిపాజిట్లు కోల్పోయిన జనసేన.. లోక్‌సభ ఎన్నికలలో గెలుస్తుందనే నమ్మకం లేదనేది కమలనాథుల వాదనగా చెబుతున్నారు. పైగా లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ సమస్యలు, స్థానిక అంశాల కంటే జాతీయ అంశాల ఆధారంగానే ఫలితాలుంటాయి. కేంద్రంలో మళ్లీ మోదీ పాలన కావాలా? వద్దా? అనే కోణంలోనే ప్రజలు ఆలోచించి ఓట్లు వేస్తారు కాబట్టి, పవన్ కళ్యాణ్ అవసరం లేదని బీజేపీ నేతలు భావించి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం ఎదురైన తర్వాత పవన్ కళ్యాణ్ లోక్‌సభ ఎన్నికల గురించి ఆలోచిస్తారా అనేది సందేహంగా మారింది. అదే సమయంలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలు ఉండడంతో..ఆ ఎన్నికలపైనే పవన్ ఎక్కువగా ఫోకస్ చేసే చాన్స్ ఉంటుంది. ఒకవేళ తెలంగాణలో పోటీ చేద్దామన్నా బలమైన అభ్యర్థులు కావాల్సిన అవసరం ఉంది. ఇలా ఎటు చూసినా బీజేపీ తీసుకున్న నిర్ణయం జనసేనకు ఊరట కల్పించేదే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు తెలంగాణలో పొత్తుకు రాం రాం చెప్పడంతో ఏపీలో కమలం, గ్లాస్ పార్టీలు కలుస్తాయా లేక విడి విడిగా పోటీ చేస్తాయా అన్నకొత్త డౌట్స్ తలెత్తుతున్నాయి. పవన్ కల్యాణ్ తాను ఇప్పటికీ NDA లోనే ఉన్నానని చెబుతున్నారు. కానీ వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఏపీలో టీడీపీతో కలసి పోటీ చేయబోతోంది జనసేన. అయితే టీడీపీతో తాము కూడా కలుస్తామని బీజేపీ అయితే ఇప్పటి దాకా ప్రకటించలేదు. తెలంగాణలో ఎలాగూ పవన్ పార్టీతో తెగతెంపులు చేసుకున్న బీజేపీ.. ఏపీలో ఏ వ్యూహంతో ముందుకెళ్తుందనే సస్పెన్స్ కొనసాగుతోంది. టీడీపీతో బీజేపీ కలుస్తుందా అనే అనుమానాలున్నాయి. జనసేన మాత్రం బీజేపీ వచ్చినా రాకపోయినా.. టీడీపీతో కచ్చితంగా కలుస్తామని చెబుతోంది. అయితే జనసేన నేతలు మాత్రం తెలంగాణ వేరు.. ఆంధ్రప్రదేశ్ వేరని ఇక్కడి పొత్తుల సంగతి బీజేపీ జాతీయ నాయకత్వం డిసైడ్ చేస్తుందని చెబుతున్నారు.