బదిలీపై వెళుతున్న స్కూల్ హెడ్మాస్టర్, తెలుగు ఉపాధ్యాయుడికి ఆ పాఠశాల విద్యార్థులు వీడ్కోలు పలికేందుకు కంటతడి పెట్టుకుని భావోద్వేగానికి గురయ్యారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం హేమల తండాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. హేమల తండాలో స్కూలు ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న మస్తాన్, తెలుగు ఉపాధ్యాయుడు దస్తగిరి పాఠశాల నుంచి బదిలీపై వెళుతుంటే విద్యార్థులు ఆవేదనకు గురయ్యారు.
సార్.. మీరే ఉండాలి. వెళ్లొద్దు. అంటూ విద్యార్థులు కంటతడి పెట్టుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. సార్ మీరు ఉండాలంటూ విద్యార్థులు బతిమిలాడడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. అంతలా విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య అనుబంధం పెనవేసుకుపోయిందనేందుకు ఉదాహరణ ఈ సంఘటన.కట్టకొమ్ముగూడెం వాసి షేక్ మస్తాన్ గత తొమ్మిదేళ్లుగా మేళ్లచెరువు మండలం హేమలతం డాలో హిందీ పండిట్‌గా, ప్రధానోపాధ్యాయునిగా విధులు నిర్వర్తించారు. ఉపాధ్యాయ వృత్తిని పవిత్రంగా భావించి, పాఠశాలను ఆయన ఉన్నతంగా తీర్చిదిద్దారు. జిల్లాలో అధికంగా విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ ఉన్న పాఠశాలగా షేక్ మస్తాన్ చేశారు. ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు కూడా పొందారు.
ఎంతో మంది దాతల సాయంతో పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించేందుకు షేక్ మస్తాన్ కృషిచేశారు. తరగతి గదుల్లో విద్యార్థులకు డెస్క్ బెంచీలు, ఫ్యాన్లు ఏర్పాటు చేయించారు. విద్యార్థులకు టై, బెల్టులు, షూస్ ఉచితంగా ఇప్పించారు. పాఠశాలను అభివృద్ధి చేసి గ్రామస్తుల ఆదరాభిమానాలు పొందారు. గ్రామ స్తుల సహకారంతో ప్రతి ఏటా పాఠశాల వార్షికోత్సవాన్ని ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. భావి భారత పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో షేక్ మస్తాన్ విశేష కృషి చేశారు.సోషల్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ పొంది తొగర్రాయిలో జెడ్పీ హైస్కూల్‌కు వెళ్తున్నారు. ఇన్ని రోజులు తమ వద్దే ఉండి, తమ ఉన్నతికి కృషిచేసిన షేక్ మస్తాన్ మాస్టారు బదిలీపై వెళ్లిపోతుండడంతో విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు. సార్ ఇక్కడే ఉండండి. అంటూ విద్యార్థులు కంటతడి పెట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


