ఈ-ఆఫీసులో ఫైళ్ల క్లియరెన్సు ప్రక్రియ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ఈ-ఆఫీసు ఫైళ్ల క్లియరెన్సు జరుగుతున్న క్రమం గురించి ఆర్టీజీఎస్ సీఈవో కె. దినేష్ కుమార్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీసులో ఫైళ్లు క్లియరెన్సులో వేగం పెరగాలన్నారు. ఫైళ్లు ఎక్కడ క్లియర్ కాకుండా ఆగిపోతున్నాయనేదానిపైన కార్యదర్శులు, శాఖల విభాగాధిపతులు సమీక్ష చేసుకుని, ఆలస్యానికి గల కారణాలు తెలుసుకుని వాటిని తొలగించి ఫైళ్లు త్వరితగతిన పరిష్కారం చేయాలని సూచించారు.
ఫైళ్లలో ఆర్థిక, ఆర్థికేతర అనే రెండు రకాల ఫైళ్లుంటాయని, ఆర్థికేతర ఫైళ్ల పరిష్కారంలో ఎట్టి పరిస్థితిలోనూ పెండింగ్‌లో ఉండకూడదన్నారు. ఆర్థిక పరమైన ఫైళ్లు అయితే ఆయా శాఖల్లోని బడ్జెట్ తదితర అంశాలను సమీక్షించుకుని ఫైళ్లను త్వరితగతిన సమీక్షించాలన్నారు. కొన్ని శాఖల్లో కొంతమంది అధికారులు తమ వద్ద ఫైళ్లను ఆరు నెలలు, సంవత్సరం వరకు ఉంచుకుంటున్నారని ఇది సరైన పద్దతి కాదన్నారు. కొన్ని ప్రభుత్వ శాఖల్లో సగటు మూడు రోజుల్లోనే ఫైళ్లు క్లియరెన్సు అవుతున్నాయని ఆర్టీజీఎస్ సీఈఓ తెలిపారు. మరికొన్ని శాఖల్లో ఫైళ్లు ఆలస్యమవుతున్నాయని చెప్పారు.