ఫోన్ ట్యాపింగ్ అనేది దేశంలో కొన్ని సందర్భాల్లోనే చట్టబద్దమైన అంశంగా చూస్తారు. దీని కోసం ప్రత్యేకమైన నిబంధనలున్నాయి. టెలిగ్రాఫ్ చట్టం -1885లోని సెక్షన్ -5(2) ప్రకారం దేశ సార్వభౌమత్వం, సమగ్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఫోన్లు ట్యాపింగ్ చేసే వెసులుబాటు ఉంటుంది. అలాగే ఐటీ చట్టంలోని సెక్షన్ 69 కూడా ట్యాపింగ్ తరహా నిబంధనలు సూచిస్తుంది. అయితే ఫోన్‌కాల్స్ ట్యాప్ చేయడానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి అనుమతి తప్పనిసరి అంటున్నాయి చట్టాలు. ఫోన్ ట్యాపింగ్ చట్టలు కఠినంగానే ఉన్నాయి. అయితే ఇంత పటిష్టమైన చట్టాలు ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ ఓ రేంజ్ లో జరిగిన విషయం అందరినీ నివ్వెరపరుస్తోంది.
అధికారమే పరమావధి అన్నట్లుగా వ్యవహరించే నేతలు, తమ ఆధిపత్యం చాటుకోవడానికి, అధికారంలో కొనసాగ డానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఫోన్ ట్యాపింగ్ ఒకటనే విమర్శ కూడా వినిపిస్తోంది. కొన్ని సంవత్సరాల కిందట పెగాసస్ అంశం దేశ రాజకీయాల్లో దుమారం రేపింది. పెగాసస్ అనే అత్యంత అధునాతన సాంకేతిక పరిగ్నానంతో రాజకీయ ప్రత్యర్థుల కదలికలపై ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై నిఘా పెట్టిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. పెగాసస్ వ్యవహారం 2012లో మరోసారి తెరపైకి వచ్చింది. 2017లోనే ఇజ్రాయెల్ తో పెగాసస్ అంశానికి సంబంధించి భారతదేశం మధ్య ఒక ఒప్పందం కుదిరిందని న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది. క్షిపణి వ్యవస్థతో పాటు స్పైవేర్ పెగాసస్ నూ 200 కోట్ల డాలర్లతో భారత్ కొనుగోలు చేసిందని ఆరోపించింది. కొందరు జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, రాజకీయనాయకులపై కొన్ని దేశాల ప్రభుత్వాలు పెగాసస్ తో నిఘా పెట్టాయన్న కథనాలు 2021లోనే సంచలనం సృష్టించాయి.
బడా రాజకీయ వేత్తలు, ప్రత్యర్థులు, రియల్టర్ల ఫోన్లే కాదు…సాధారణ వ్యక్తులు, మేధావులు, ఉద్యమకారుల ఫోన్లను కూడా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ట్యాప్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి ఏ వ్యక్తికైనా గోప్యత ఉంటుంది. ఎవరితో మాట్లాడుతున్నాడు…వారి సంభాషణల్లో ఏఏ అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి అనేది గోప్యంగా ఉంటుంది. సమాజంలో ఎంతటి పెద్దవారైనా, చిన్నవారైనా తమ వ్యక్తిగత విషయాలు అలాగే ఇతరులతో సంభాషణలు గోప్యంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఒక వ్యక్తికి తెలియకుండా… అతడు లేదా ఆమె ఎవరితో మాట్లాడుతున్నారు…. ఏం మాట్లాడుతున్నారు అనే అంశంపై ఆసక్తి పెంచుకోవడం, వారి సంభాషణ వినడం…. వ్యక్తిగత గోప్యతా హక్కుకు భంగం కలిగించడమే. అయితే వ్యక్తిగత గోప్యతా హక్కుకు భంగం కలిగించడం కూడా కొన్నిసార్లు పరిధి దాటుతుంటుంది. ఫోన్ ట్యాపింగ్ కు సాయం చేసే సర్వర్లు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండటంతో ఎవరి సంభాషణలనైనా వినడం సులభమవుతుంది. ఇదో ప్రమాదం.ఫోన్ల ట్యాపింగ్ ద్వారా టార్గెట్‌గా పెట్టుకున్న వ్యక్తులకు సంబంధించిన డేటా అందుతుంది. ఈ డేటా ఆధారంగా సదరు వ్యక్తులను బెదిరించి అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. అలాగే డబ్బు గుంజడం కూడా జరుగుతుంది. అంతేకాదు..డేటాను ఆయుధంగా ఉపయోగించుకుని ఆర్థిక ప్రయోజనాలు, ఆస్తులు రాయించుకోవడాలు, మహిళలను ఎక్స్‌ప్లాయిట్ చేయడం వంటి దారుణాలు కూడా జరిగే అవకాశాలున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ అంశం, తేలికగా తీసుకోదగ్గది కాదు. దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. సహజంగా ప్రజల ధన మాన ప్రాణాలకు ప్రభుత్వాలు రక్షణ కల్పిస్తాయని అందరూ భావిస్తారు.అయితే సాక్షాత్తూ ప్రభుత్వాలే ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడితే భవిష్యత్తు ఏమిటి ? అనే ప్రశ్న చర్చకు వచ్చింది. ప్రజల వ్యక్తిగత విషయాలను ప్రభుత్వాలే బజారుకీడ్చడానికి ప్రయత్నిస్తే ఇక జనం జీవితాలకు భద్రత ఎక్కడ అనే ప్రశ్న తెరమీదకు వచ్చింది. పోలీసులు చట్టాలను పరిరక్షిస్తారని సామాన్య ప్రజలు అనుకుంటారు. చట్టాన్ని ఉల్లంఘించేవారికి పోలీసులు చుక్కలు చూపిస్తారని కూడా సాధారణ ప్రజలు భావిస్తారు.అయితే గత ప్రభుత్వం పోలీసు వ్యవస్థకు అపరిమిత అధికారాలు కట్టబెట్టిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. పాలకవర్గాలు ఇచ్చిన మితిమీరిన స్వేచ్ఛతో ఏకంగా పోలీసులే చట్టాలను ఉల్లంఘిస్తే, ఇక వారిని కట్టడి చేసేదెవరని మేధావులు, ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి.


