ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. గడిచిన నాలుగైదు రోజుల్లో రాష్ట్రంలోనే అతితక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం 6 గంటలు దాటితే చాలు.. జనాలు బయటకి రావాలంటేనే భయపడుతున్నారు. ఉదయం 8 గంటల దాటాక కూడా వాతావరణం పొగమంచుతో కప్పి ఉంటుంది. నిత్యం జన సంచారం, వాహనాల రాకపోకలతో రద్దీగా కనిపించే రోడ్లు చీకటి పడిందంటే చాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం చలికి వణికిపోతున్నారు. ఉత్తరాది నుంచి వీస్తున్న చల్లని గాలులకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. రాత్రి వేళల్లో నాలుగు నుంచి ఆరు డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం 9 గంటల వరకు ఇళ్ల నుండి బయటకు వెళ్లడానికి జనాలు భయపడుతున్నారు. వృద్ధులు, పిల్లలు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో వారం రోజులపాటు మరింత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని.. ప్రజలు చలికి అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు.