హైదరాబాద్ నగరంలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం పడింది. దీంతో జలమండలి అధికారులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారులు, జీఎం, డీజీఎం, మేనేజర్‌లతో ఎండీ అశోక్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పర్యటించాలని.. వాటర్ లాగింగ్ పాయింట్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని.. వీలైన చోట్ల క్లోరిన్ బిళ్లల పంపిణీ చేయాలని పేర్కొన్నారు. సహాయక చర్యల్లో ఈఆర్టీ, ఎస్పీటీ టీమ్‌లు పాల్గొననున్నట్లు తెలిపారు.
కలుషిత నీరు సరఫరా అయ్యే ప్రాంతాల్లో.. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ఆదేశించారు. జీహెచ్ఎంసీ, పోలీసు శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మ్యాన్ హోళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ తెరవొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏవైనా సమస్యలుంటే కస్టమర్ కేర్ నంబర్ 155313కి ఫోన్ చేయాలని కోరారు. మరో రెండ్రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో.. ఉద్యోగులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు.