23.7 C
Hyderabad
Wednesday, October 15, 2025
spot_img

అగ్రరాజ్యం అమెరికాలో రెండు ఫ్లయిట్ల ఫైట్ – ఇదిగో ఇది ఆ చోద్యం

కొట్టు కోవడాలు, ఢీ కొట్టు కోవడాలు, కుస్తీ పట్లకు దిగడాలు…విరోధులకు తప్ప దోస్తులకు, నేస్తాలకు ఉండవు కదా..! అవును. ఇందులో సందేహానికి తావేముంది, అనుమానానికి ఆస్కారం ఏముందని…ఎవరైనా చిరాకు ప్రదర్శించడంలో వీసమెత్తు తప్పు లేదు. అంతా ఒప్పే. అయితే, ఈ యవ్వారం మనుషులకు సంబంధించేదేమి కాదు. అయితే, జంతువులు, పాములు, పక్షులకు చెందినది భావిస్తున్నారా.. అలా అయినా.. తప్పులో కాలేసినట్టే. ఈ డేరింగ్, డేషింగ్ వ్యవహారం సాగించింది లోహ విహంగాలు. ఏంటేమిటి.. అన్నా.. యూ మీన్ అన్నా.. ఇది నిజ్జంగా నిజం. ల్యాండ్ అయ్యే విమానం సమీపానికి మరో విమానం వచ్చేసింది. ఇది అవమానంగా భావించిందో ఏమో .. ముందు విమానం పోట్లాటకు సై అనే పరిస్థితి వచ్చేసింది. అయితే, పైలట్ చేతిలో తమ రిమోట్ ఉందనే మాట మరిచిపోయి..ఈ రెండు విమానాలు పోట్లాటకు దిగడానికి ప్రయత్నించాయి. అయితే, వాటి యత్నం వర్క్ అవుట్ కాలేదు.

రన్ వే పై ఓ లోహ విహంగం ల్యాండ్ అవుతుండగా అక్కడికి మరో విమానం తయారైంది. అప్పుడేం జరిగిందంటే.. ఏమీ జరగలేదు. ఇట్ మీన్స్ ప్రమాదం జరగలేదు. ఇక విషయంలోకి వస్తే.. అగ్ర రాజ్యం అమెరికాలో రెండు విమానాలు ఉగ్రరూపం దాల్చాయి. కారణం ఏమిటో తెలియదు కాని షికాగో ఎయిర్ పోర్టులో రెండు విమానాలు ఢీ కొనేంత పరిస్థితి ఏర్పడింది. రన్ వే పైకి ఓ విమానం ల్యాండ్ అవుతుండగా, రూల్స్, రెగ్యులేషన్లు, మంచి, మర్యాదలు అన్నీ గాలికొదిలేసిన మరో విమానం.. ఈ విమానానికి అడ్డుగా వచ్చేసింది. పైలట్ చాకచక్యం ప్రదర్శించక పోతే.. రెండు విమానాలు ఏ పార్ట్ కు ఆ పార్ట్ ఊడిపోయి.. ఏ షెడ్డుకో వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చేది. మాయదారి ఫ్లయిట్ల ఫైటింగ్ తో… ఎన్నో నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. రెండు విమానాల్లో కలిపి వంద మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. లిప్తపాటు కాలం లో జరిగిన ఈ ఘటనతో అసలు ఏం జరుగుతోందో ప్రయాణికులకు అర్థం కాలేదు. సంభ్రమాశ్చర్య ఆందోళనలకే గురయ్యారో, హార్ట ఎటాక్ లకే గురయ్యారో కాని.. మొత్తానికి ఠారెత్తిపోయారు.

షికాగోలో సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ విమానం ఒమాహా నుంచి షికాగో మిడ్ వే ఎయిర్ పోర్ట్ కు చేరుకుని, రన్ వే 30 సీ మీద ల్యాండ్ అవ్వడానికి సిద్ధమైంది. సరిగ్గా అదే సమయానికి, అదే రన్ వే పైకి ఛాలెంజర్ 350 ప్రైవేట్ జెట్.. అకారణ ఛాలెంజ్ కు దిగి.. అడ్డంగా వచ్చి నిలబడబోయింది. దీన్ని గమనించిన సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. అప్పటికే ల్యాండింగ్ గేర్స్ సైతం ఓపెన్ అయిపోయాయి. విమాన చక్రాలు దాదాపు రన్ వేని తాకబోయాయి. అయితే, ఎదురుగా వస్తున్న ప్రైవేట్ జెట్ ను గమనించిన పైలట్లు వెంటనే ఆ విమానాన్ని పైకి లేపారు. పైలట్ అప్రమత్తతతో రెండు విమానాలు ఢీ కొనే ప్రమాదం తప్పింది. ప్రైవేట్ జెట్ బారి నుంచి మొదటి విమానం తన మానాన్ని కాపాడుకుని, అందరినీ కాపాడిందని నెటిజన్లు, సిటిజన్లు హాస్య కామెంట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

ఫెడరల్ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఎఫ్‌ఏఏ ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టింది. ఛాలెంజర్‌ 350 ప్రైవేటు జెట్‌ కు ఎలాంటి అనుమతులు లేకుండానే ఒక్కసారిగా రన్‌వేపైకి వచ్చేసిందని ఎఫ్‌ఏఏ వర్గాలు తెలియజేస్తున్నాయి. మరిందుకు శిక్షలు, పనిష్ మెంట్లు సంస్థ ఉద్యోగులకే వేస్తారో, విమానాలకే వేస్తారో కాని.. ఈవెంట్ మాత్రం ఈ తీరున జరిగింది. శిక్షలు వేయడం గురించి చూస్తే..వెనకటి సంఘటన ఒకటి గుర్తుకు వస్తోంది. ఓ జడ్జిగారి ఇంటి పెరటి తోటలోకి ఓ మేక ప్రవేశించి.. ఏపుగా పెరిగిన పంటంతా ఆరగించేసిందిట. దీంతో, ఆ జడ్జి సార్ కు కోపం వచ్చేసి..ఆ మేకకు సంకెళ్లు వేయించి, రోడ్డు మీద నడిపించి, జైల్ లో పెట్టించేసే శిక్ష వేసేశారు. ఇకపై ఆ మేక సిగ్గుతెచ్చుకుని అలాంటి పంట చోరీ నేరాలకు పాల్పడదని ఆ న్యాయమూర్తిగారి ఉద్దేశం అయ్యి ఉండవచ్చు. నేరగాళ్లకు శిక్షలు వేసి, వేసి…అదే తీరున మేకకు శిక్ష వేసి పారేశారుట. మే, మే అనడం తప్ప సిగ్గు, శరాలు తమకేం ఉంటాయి, అయినా, సిగ్గు, శరాలు లేకుండా మానవ సంఘమే యథేచ్ఛగా తిరుగుతున్నప్పుడు తమకు వాటితో పనేంటని..ఆ మూగ జీవి..మూగ వేదన అనుభవించి ఉండవచ్చు. ఈ ఘటన సైతం గతంలో…ఈ అగ్రదేశం అమెరెకాలోనే ఏదో మూల జరిగినట్టు ఒకప్పుడు మీడియా లో వార్త వచ్చింది.

లోహ విహంగాలకు….స్వేచ్ఛా విహంగాలు, పెద్ద రెక్కల పక్షులు అడ్డువచ్చి చికాకు కల్పించిన సందర్భాలు మనకు తెలుసు. గగనంలో అక్కడక్కడ విమానాలు దగ్గరపడి దూరం అయిన ఘటనలు, ప్రాణాపాయాలేవి లేని సంఘటనలు మనం వార్తలుగా చదివాం, చూశాం. ఇప్పుడు ఈ ప్రైవేట్ జట్ మరీ బరిదెగించి, రన్ వే పై ల్యాండ్ అవుతున్న విమానం దరికే వచ్చేయడంతో…ప్రజలందరూ ముక్కున వేలేసుకుని కలికాలం, పోగాలం, కలుషిత కాలం అంటూ రకరకాల కామెంట్లు చేసేస్తున్నారు.

ఇదివరలో విమానాలు చిత్ర, విచిత్రాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం సాక్షాత్ హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలోనే ఓ విమానం ప్రదర్శించిన తీరు.. ఎన్ని చిక్కులకు కారణమైందో.. ఓ సారి మననం చేసుకుందాం. నాడు దుబాయ్ కి బయలు దేరిన ఓ విమానం గోడను ఢీ కొట్టేసి గాల్లోకి ఎగిరిపోయింది. మరి ఆ విమానానికి ఆ గోడ మీద ముద్దే వచ్చిందో, కోపమే వచ్చిందో తెలియదు కాని.. ఆ గోడను ఢీ కొని వెళ్లడంతో… తన రెక్కలకు డ్యామెజ్ చేసేసుకుంది. ఈ తిక్క పని వల్ల.. దుబాయ్ కి ఈ విమానం చేరుకోగా.. శంషాబాద్ లో గోడను ఢీకొన్న నిర్వాకాన్ని పసిగట్టేసిన సదరు దుబాయ్ ఎయిర్ పోర్టు సిబ్బంది, డ్యామెజ్డ్ ఫ్లయిట్స్ దిగడానికి తాము ఒప్పుకోం అన్నారు. దీంతో, ఆ విమానం నడుపుతున్న పైలట్లకు ఏం చేయాలో తెలియక.. విమానాన్ని కాసేపు గాల్లో చక్కెర్లు కొట్టించారు. ఎంతసేపు బతిమాలాడినా.. దుబాయ్ విమాన సిబ్బంది ససేమిరా అనడంతో.. ఇక చక్కెర్లు కొట్టించడం తన వల్ల కాదని.. ఆ విమానాన్ని తిరిగి హైదరాబాద్, శంషాబాద్ కు తీసుకొచ్చేశారు. అయితే, తాము పంపించేసిన విమానాన్ని తామెందుకు రిసీవ్ చేసుకుంటామని శంషాబాద్ ఎయిర్ పోర్టు సిబ్బంది పేచీ పెట్టారు. దీంతో శంషాబాద్ లో దిగడానికీ వీలు లేక పైలట్లు అక్కడ ఆకాశంలో విమానాన్ని చక్కెర్లు కొట్టించారు. దీంతో.. ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. అసలు తాము ఎక్కడ ఉన్నాం.. అని ఓ సారి ఒంటిని గిల్లుకుని చూసుకున్నారు. బయల్దేరింది శంషాబాద్ లో అయితే, చేరుకోవాల్సిన దుబాయ్ కి చేరుకోకుండా, తిరిగి శంషాబాద్ కు రావడం ఏమిటి, ఆకాశంలో ఈ చక్కెర్లు కొట్టడం ఏమిటని ఆందోళన చెందారు. ఇక.. విమాన పైలట్లు బుర్రకు పదును పెట్టి.. తమకు ముంబై విమాన సిబ్బందితో కాస్తో కూస్తో ఉన్న అనుబంధంతో.. అక్కడకు తీసుకెళ్లి, వాళ్లని ఎలాగోలా ఒప్పించి అక్కడ విమానాన్ని దించేశారు. అటు, శంషాబాద్ కాదు, ఇటు దుబాయ్ కాదు.. మధ్యలో ఈ ముంబై గొడవేంటని విమాన ప్రయాణికులు తలలు పట్టుకున్నారు.

ఏదైనా రోడ్డు ప్రయాణంలో టూ విలర్లో, బస్సులో, లారీలో ఢీ కొన్నాయంటే అర్థం ఉంటుంది, రైళ్లు పట్టాలు తప్పాయంటే ఏదో పొరపాటో, గ్రహపాటు అని అనుకోవచ్చు. ఆకాశంలో విహరించే విమానాలు రన్ వే మీద ఢీ కొనే పరిస్థితులేమిటని ప్రయాణికులు మండిపడుతున్నారు. పొరపాట్లు, గ్రహపాట్లు వరకు సైతం ఊరుకోవడానికి ఇవేమి ఆషామాషీ విషయాలు కాదు కదా.. ఎన్నో ప్రాణాలతో పని. ఇప్పుడు పొరపాట్లు, గ్రహపాట్లు అని చెప్పి.. ఆ పై అలవాటై పోయిందని పళ్లు ఇకిలించేస్తే.. పళ్లు రాలగొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇకపై నైనా .. ఆకాశ ప్రయాణాలు, విమాన ప్రమాదాల విషయంలో విమాన సిబ్బంది.. ఏమరపాట్లు, పొరపాట్లు లేకుండా.. క్రమ శిక్షణతో, త్రికరణ శుద్ధిగా, న్యాయబద్ధంగా విధులు నిర్వహించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. నిర్లక్ష్యం, అలక్ష్యం, అలసత్వాలతో ఎందరి ప్రాణాలో తీయడమే కాకుండా తమ ప్రాణాలు పొగొట్టుకునే రీతిలో వ్యవహరించరాదని రాంగ్ రూట్ లో వెళ్లి సిబ్బందిని హెచ్చరిస్తున్నారు. ఇందులో తమ పాత్ర ఏం లేదని.. తమ బాస్ అదేనండి.. పైలట్ ఎలా చెబితే అలా విని.. ఆ రూట్ లోనే ఆకాశంలో ఎగురులాట సాగిస్తున్నామని…ప్రయాణికులను సేఫ్ గా వాళ్ల గమ్యస్థానాలకు చేరుస్తున్నామని విమానాలు తెలియజేస్తున్నాయి. డ్యాష్ లు, ఢీ కొనడాలు, ఏక్సిడెంట్లు, ఇన్సిడెంట్ల లో తమ పాత్ర అణుమాత్రమైనా లేదని విమానాలు వెల్లడిస్తున్నాయి.
—–

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్