తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. మంత్రివర్గ విస్తరణపై పార్టీ అధిష్టానంతో సీఎం చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడిని ఏఐసీసీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో గత కొద్ది నెలలుగా వాయిదా పడుతున్న మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం దృష్టి సారించింది. ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో సీఎంతో సహా 12 మంది మంత్రివర్గంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకొని ..రెండు పెండింగ్ లో పెట్టే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్‌సాగర్ రావు, వివేక్, వినోద్‌లు పోటీ పడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్‌రెడ్డి, మదన్‌మోహన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇక, రంగారెడ్డి జిల్లా నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి కూడా మంత్రివర్గంలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంత్రివర్గంలో అవకాశం దక్కని సామాజిక వర్గాలకు పీసీసీలో ప్రాధాన్యత ఇవ్వాలని అదిష్టానం భావిస్తోంది.