స్వతంత్ర వెబ్ డెస్క్: నెల ప్రారంభం అయ్యిందంటే చాలు కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి. అలానే మార్కెట్‌లో చూసుకుంటే.. కొన్నింటి ధరలు పెరగడం, తగ్గడం వంటివి జరుగుతాయి. ఇక ప్రతి నెల ఆరంభంలో చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తాయి. ఎక్కువ సార్లు మాత్రమే గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడమే చూస్తుంటాం. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. వినియోగదారులకు గ్యాస్ కంపెనీలు శుభవార్త చెప్పాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను భారీగా తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ రేట్ల తగ్గింపు నేటి నుంచి అంటే ఆగస్టు 1 , 2023 నుంచే అమలులోకి వస్తుంది. అయితే గృహ వినియోగానికి వాడే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు చమురు కంపెనీలు.
ఆయిల్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరలను తగ్గించాయి. ఒక్కో సిలిండర్ పై రూ. 99.75 మేర తగ్గించాయి. ధరల తగ్గింపుతో ప్రస్తుతం 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర ఢిల్లీ రిటైల్ మార్కెట్లో రూ. 1,680కి దిగివచ్చింది. ఇక డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు చమురు సంస్థలు. ఇక ప్రస్తుతం మన హైదరాబాద్‌లో గృహ అవసరాలకు వినియోగించే ఎల్‌పీజీ గ్యాస్ ధర సిలిండర్ రూ. 1155గా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో చూస్తే డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 1161 వద్ద కొనసాగుతోంది. కేంద్రం చివరిసారిగా 2023, మార్చి 1న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గించింది. ఆ తర్వాత ఆ దిశగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఈ నెలలో అయినా డొమెస్టిక్ సిలిండర్ ధరలను తగ్గిస్తుందని ఆశించిన జనాలకు నిరాశే ఎదురయ్యింది.
నేడు చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించడంతో.. ఢిల్లీలో 19 కేజీల కమెర్షియల్ సిలిండర్ ధర రూ. 1680కి దిగిరాగా.. కోల్‌కతాలో ఈ రేటు రూ. 1802కు దిగి వచ్చింది. అటు ముంబైలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1640కి దిగి వచ్చింది. చెన్నైలో చూస్తే వాణిజ్య సిలిండర్ ధర రూ. 1852కు తగ్గింది. ఆయా ప్రాంతాల్లో ఉన్న ట్యాక్సులు, ఇతర కమీషన్ల వంటి వాటి కారణంగా గ్యాస్ సిలిండర్ ధరల్లో తేడాలున్నాయి. అందుకే సిలిండర్ ధర.. ఒక్కో నగరంలో ఒక్కో విధంగా ఉంది. మరోవైపు.. ఈ ధరలతో పాటు డెలివరీ ఛార్జీలు సైతం చెల్లించుకోవాల్సి వస్తోంది. దాంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. డెలివరీ ఛార్జీలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్పటికి కూడా.. చాలా చోట్ల మాత్రం ఇంకా డెలివరీ ఛార్జీలు వసూలు చేస్తూనే ఉన్నట్లు తెలుస్తోంది.