డయారియా ప్రబలకుండా క్షేత్రస్థాయిలో వైద్యారోగ్యశాఖ అధికారులు అలర్ట్ అవ్వాలని మంత్రి సత్య కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. డయారియా ప్రబలుతుండడంపై వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమీక్షలో సంబంధిత అధికా రులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డయేరియాతో పాటు సీజనల్ వ్యాధులు, కీటక జనిత వ్యాధులపై మంత్రి నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
డయేరియాపై వెంటనే సరైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వ్యాధి ముదరక ముందే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటువంటి పరిస్థితిని చూసి సిగ్గుపడాలని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో సేవల్ని మరింత మెరుగుపర్చడం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కేబినెట్‌లో సీఎం అన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆశయాలకనుగుణంగా పనిచేయాలని సూచించారు. డయేరియా ప్రబలిన తర్వాత చేపట్టే చర్యలు కంటే ముందస్తు చర్యలు వల్ల ప్రాణాల్ని కాపాడినవారమవుతామని అన్నారు. ఏ విధంగా నీరు కలుషితమవుతోందన్న అంశంపై సంబంధిత శాఖలతో సమన్వయం చేసు కుని పనిచేయాలని ఆదేశించారు.ఏదో మమ అనిపించుకుని పైవారికి చెప్పాం కదా అనే వైఖరి ఇక మానుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. డయేరియా ప్రబలి కేసులు పెరిగాక ఆందోళన పడటం కంటే క్షేత్ర స్థాయిలో ముందే అలెర్ట్ అయి గుర్తించాలని సూచించారు. మిగతా శాఖలతో సమన్వయం చేసుకుని పనిచేస్తే చాలా వరకూ డయేరియాను నివారించగలిగేవాళ్లం అని తెలిపారు. డయారియా ప్రబలుతున్నా కింది స్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పై అధికారుల పర్యవేక్షణ కూడా పటిష్టంగా ఉండాలన్నారు. ఉద్యోగ ధర్మమే కాకుండా సామాజిక బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ప్రజల ప్రాణాలకు జవాబుదారులగా ఉండాలన్న మంత్రి… క్లోరినేషన్ సరిగా జరగుతోందా లేదా అనే విషయం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంబంధిత శాఖ అధికారులతో చెక్ చేసుకోవాలని స్పష్టం చేశారు.