నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీపై నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. దిలావర్‌పూర్ ఫ్యాక్టరీ పాపం బీఆర్ఎస్‌దే అంటోంది కాంగ్రెస్. గత ప్రభుత్వ హయాంలోనే ఒప్పందాలు జరిగాయని చెబుతోంది. ఇథనాల్ పరిశ్రమ బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కుటుంబానిదేనని మంత్రి సీతక్క ఆరోపించారు. పీఎంకే డిస్టిలేషన్స్ కంపెనీలో తలసాని కుమారుడు, అల్లుడు భాగస్వాములని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క ఆరోపించారు. దిలావర్‌పూర్‌లో కర్మాగారం ఏర్పాటు చేయించి.. రైతులను ముంచే ఆలోచన చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆమె అన్నారు. ఇప్పుడు అదే పార్టీ రైతులను రెచ్చగొట్టి ప్రజాప్రభుత్వంపై కుట్రలు చేస్తోంది. అక్కడ ఇథనాల్ కర్మాగారం ఏర్పాటు చేసుకునేందుకు 2023 ఏప్రిల్ 3న అప్పటి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. 2023 జూన్ 15న కాళేశ్వరం ప్యాకేజీ నెంబర్ 27 నుంచి ఏడాదికి 18.351 MCFT నీళ్లను కేటాయిస్తూ నీటిపారుదల శాఖ ఉత్తర్వులు ఇచ్చిందని సీతక్క తెలిపారు.
ఇథనాల్ కంపెనీ తలసాని ఫ్యామిలీదేనని టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ అన్నారు. తలసాని కుమారుడు సాయికిరణ్ డైరెక్టర్‌గా ఉన్నారని చెప్పారు. ఇథనాల్ ఫ్యాక్టరీపై స్పందించిన మాజీ మంత్రి తలసాని.. కంపెనీతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. నిర్మల్ జిల్లాలో నిర్మించబోయే ఇథనాల్ కంపెనీ విషయంలో తమ కుటుంబంపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. ఉన్నతమైన పదవిలో ఉన్నప్పుడు ఎంతో బాధ్యతగా మాట్లాడాలని సూచించారు. ఆరోపణలు చేసేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. ఇష్టారీతిన మాట్లాడతాం అంటే సరికాదని హితవు పలికారు. ఇథనాల్ కంపెనీలో తమకు భాగస్వామ్యం ఉన్నట్లు రుజువు చేస్తే ఆరోపణలు చేస్తున్న పార్టీకి, వ్యక్తులకే అప్పగిస్తామని తలసాని స్పష్టం చేశారు.