ఎమ్మెల్యేగా పాడి కౌశిక్ రెడ్డి గెలిచి ఆరు నెలలు గడుస్తున్నా క్యాంపు ఆఫీసులో అడుగుపెట్టలేదు. క్యాంపు కార్యాలయానికి వాస్తు దోషం ఉందని పండితులు తెలపడంతో దానికి మెరుగులు దిద్దే పనిలో అధికారులు బిజీ అయ్యారు. ఎంతో ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వాస్తు పేరుతో గత ఎమ్మెల్యే ఈటెల కాంపౌండ్ వాల్‌ను ధ్వంసం చేసి వేరే చోట నిర్మించారు. మళ్లీ తర్వాత ఎన్నికైన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గతంలో వాస్తు దోషం ఉండడం వల్లే ఈటెల తిరిగి ఎమ్మెల్యేగా గెలవలేదని తాను అందులోకి వెళితే తనకు కూడా దోషం పట్టుకుంటుందని గట్టిగా నమ్మాడు.
వాస్తు పండితులు సూచనలతో ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండే గుమ్మటాన్ని తొలగించే పనిని అధికారులకు అప్పగించారు. ఆర్ అండ్ బీ అధికారులకు పురమాయించగా నిధులు లేకపోవడంతో రెవెన్యూ అధికారులకు తిరిగి పనిని బదిలీ చేశారు. వారు సిబ్బందిని ఏర్పాటు చేసి గుమ్మటాన్ని రెండు పిల్లర్లను తొలగించే పనిలో ఉన్నారు. ఈ విషయం రోడ్డుపై వెళ్లే వారికి కంటపడడంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వాస్తు ప్రకారం లేదంటూ ధ్వంసం చేస్తున్నారని ప్రచారానికి తెరలేపారు.
ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ భవనాన్ని ఎవరు ప్రజాప్రతినిధిగా ఎన్నికైన దానిలో ఉండాల్సింది పోయి వారి సొంత భవనం వలే మార్పులు చేర్పులు చేసుకోవడం, తిరిగి ప్రజాధనాన్ని వృధా చేస్తుండడంతో ప్రజలు మండిపడుతున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులే యదేచ్చగా మూఢనమ్మకాల, వాస్తు పేరుతో శాశ్వత పక్కా భవనాలను ధ్వంసం చేస్తూ మళ్ళీ నిర్మిస్తూ డబ్బులు వృధా చేయడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.