మేడ్చల్‌లోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గర్ల్స్ హాస్టల్ బాత్‌రూమ్‌లో వీడియోలు తీశారని విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట చేసే వారే వీడియోలు తీసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, సిఐ సత్యనారాయణ చేరుకుని పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. కాగా విద్యార్థినుల ప్రైవేటు వీడియో రికార్డులు ఉన్నట్లు వస్తున్న ఆరోపణలలో ఇంతవరకు ఆధారాలు దొరకాలేదని, అనుమానితులు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నామని ఏసీపీ తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు రుజువైతే నిందితులకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సిఎంఆర్ కాలేజీలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. కళాశాల హాస్టల్‌కు ఏసీపీ, సీఐ చేరుకున్నారు. కండ్ల కోయలోని సీఎంఆర్ కాలేజీలో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. హాస్టల్ బాత్‌రూమ్‌లో వీడియోలు తీశారని అర్ధరాత్రి 2 గంటల వరకు విద్యార్థులు ఆందోళన కొనసాగించారు. అనుమానితులైన ఏడుగురుని అదుపులోకి తీసుకున్నారు మేడ్చల్ పోలీసులు. వారి వద్ద నుండి 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుందామని సిఐ సత్యనారాయణ తెలిపారు. విద్యార్థినుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మేడ్చల్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
సెక్యూరిటీ రూమ్ ధ్వంసం చేసి అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళన చేశారు. కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హామీ ఇవ్వడంతో అర్ధరాత్రి ఆందోళన విరమించుకున్నారు. ఇచ్చిన టైం లోగా చర్యలు తీసుకోకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం కళాశాల వద్ద పరిస్థితి అదుపులో ఉంది.