స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్టంలో ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే జనం బెంబెలేత్తిపోతున్నారు. ఎండలు పెరగడంతో రాత్రి పగలు అనే తేడా లేకుండా ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వారం రోజుల క్రితం వరకు వర్షాలతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పుడు ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగిపోయాయి. గడిచిన 24 గంటల్లో కరీంనగర్, జనగాం, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేటి నుంచి తెలంగాణలోని 14 జిల్లాల్లో ఎండలు ఠారెత్తనున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
నల్గొండ , సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి, వరంగల్, హన్మకొండ, కొమురం భీం, కరీంనగర్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో వడగాల్పుల తీవ్రంగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. మే 14 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఎండల ప్రభావం అధికంగా ఉండనుందని చెప్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఎండలో బయటకు రావొద్దని వార్నింగ్ ఇచ్చారు.


