తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుకు కేంద్రం షాకిచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల పాస్పోర్ట్లను సస్పెండ్ చేసింది. ప్రభాకర్ రావుతో పాటు శ్రావణ్‌రావు పాస్‌పోర్ట్ను కూడా కేంద్రం సస్పెండ్ చేసింది.
ఈనేపథ్యంలోనే ప్రభాకర్‌రావు తరఫు న్యాయవాదులు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వద్ద పిటిషన్ దాఖలు చేశారు. కీలక నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ రావుల పాస్ పోర్ట్లను రద్దు చేయాలని పోలీసులు సిఫారసు చేశారు. ఇంటర్ పోల్ ద్వారా ఇద్దరినీ ఇండియాకి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. రెడ్‌కార్నర్ నోటీసులు ఆలస్యం అవుతుండటం, ప్రభాకర్‌రావు రాజకీయ శరణార్థిగా దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు.
ఒకవేళ ప్రభాకర్‌రావు దరఖాస్తుపై అమెరికా నుంచి ఏదైనా ప్రాసెస్ మొదలైతే..కేసు తీవ్రత గురించి వెల్లడించేందుకు సిద్ధం అవుతున్నారు. నిందితులిద్దరినీ వీలైనంత త్వరగా రప్పించేందుకు మార్గాలు వెతుకుతున్నారు. ఇందులో భాగంగా అమెరికా, ఇండియా మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందాన్నీ ప్రయోగించనున్నట్లు తెలిసింది.
దీంతో అవసరమైన న్యాయ సలహాలు పోలీసులు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్, బీజేపీలకు అనుకూలంగా ఉన్న వ్యాపారవేత్తల ఫోన్ నంబర్స్‌ను ట్యాప్ చేయడంలో శ్రవణ్‌రావు కీలకంగా వ్యవహరించినట్లు ఆధారాలు సేకరించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు అమెరికా ప్రభుత్వాన్ని ఆశ్రయం కోరాడు. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. తన గ్రీన్ కార్డ్, క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన హెల్త్ రిపోర్టులు సహా..రాష్ట్రంలో పోలీసులు నమోదు చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు వివరాలను జత చేస్తూ యూఎస్ రెఫ్యూజీ అడ్మిషన్స్ ప్రోగ్రామ్ ద్వారా అమెరికా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వంలో పోలీస్ అధికారిగా కీలక బాధ్యతలు నిర్వర్తించానని దరఖాస్తులో ప్రభాకర్ రావు పేర్కొన్నట్లు సమాచారం. ప్రభుత్వం మారాక తనపై రాజకీయపరంగా అక్రమ కేసులు నమోదు చేశారని దరఖాస్తులో పేర్కొన్నట్లు తెలిసింది. తన వయస్సు, అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా స్వదేశంలో వేధింపులు ఎదుర్కోలేనని పేర్కొన్నట్టు తెలుస్తోంది.