స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలో రైతు సమాధులపై దాష్టీక పాలన నడుపుతున్న కేసీఆర్.. ఇప్పుడు మహారాష్ట్ర రైతులను ముంచే పనిలో పడ్డాడని మండిపడ్డారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్.షర్మిల. రాష్ట్రంలో బుడ్డ దొరలకు, జమీందార్లకు, ఉద్యమద్రోహులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి.. మహారాష్ట్రలో మాత్రం రైతులు అసెంబ్లీకి పోవాలంటూ గప్పాలు కొడుతుండు పెద్ద దొర అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. మీరు చెప్పే తెలంగాణ మోడల్ అంటే.. తొమ్మిదేండ్లలో 9వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడమా? పంట బీమా ఇవ్వక పోవడమా? పంట నష్టం జరిగితే మాట ఇచ్చి పరిహారం ఎగ్గొట్టడమా? రాయితీ ఎరువులు, విత్తనాలు ఎత్తేయడమా? బడా బాబులకు రూ.వేల కోట్ల రైతుబంధు దోచిపెట్టడమా? ప్రాజెక్టుల పేరుతో రూ.లక్షల కోట్లు దోచుకోవడమా? అంటూ ప్రశ్నించారు.
కనీస కనికరం లేకుండా రైతుల భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమా? అసైన్డ్ భూములను సైతం లాక్కొని రైతును రోడ్డునపడేయడమా? కౌలు రైతు.. రైతే కాదని చెప్పడమా? వరి వేస్తే ఉరేనని రైతులను బెదిరించడమా? కేసీఆర్ కు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, నీది నిజంగానే కిసాన్ సర్కార్ అయితే.. రుణమాఫీ చేయనందుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 119 చోట్ల రైతులకే టికెట్లు ఇవ్వాలి. దళిత రైతును ముఖ్యమంత్రి చేసి, ఇతర రైతులను మంత్రులను చేయాలి. మాట ఇస్తే.. తలనరుక్కునే ముఖ్యమంత్రికి ఈ దమ్ముందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.