స్వతంత్ర వెబ్ డెస్క్: టీ హబ్‌లో మహారాష్ట్ర క్రెడాయి ప్రతినిధుల బృందంతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్ ప్రగతిపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత పదేండ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు ఉన్న విద్యుత్, తాగునీటి వంటి సంక్షోభాలను విజయవంతంగా అధిగమించామని తెలిపారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి బహుముఖ వ్యూహాంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు ఆకర్షించేలా మౌలిక వసతుల కల్పన చేపట్టాం. ఇవాళ అనేక ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లో కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరును అధిగమించాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఐటీ ఎగుమతులతో పాటు వరి ధాన్యం ఉత్పత్తిలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉందని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం మౌలిక వసతులతో పాటు పరిపాలనా సంస్కరణలపై ప్రధానంగా దృష్టి సారించింది. టీఎస్ ఐపాస్, భవన నిర్మాణాల అనుమతుల కోసం టీఎస్ బీపాస్‌ను ప్రవేశపెట్టాం. తెలంగాణ విధానాలను అనేక రాష్ట్రాల ప్రతినిధులు వచ్చి అధ్యయనం చేశారు. హైదరాబాద్ అభివృద్ధిని అనేక మంది ప్రముఖులు ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. ముంబై తర్వాత ఎత్తైన భవనాలు కలిగిన నగరంగా హైదరాబాద్ స్థానం సంపాదించుకుందని కేటీఆర్ తెలిపారు.