తెలంగాణకి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటనకు బయలుదేరారు. ఈ నెల 14 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. సీఎం వెంట సీఎస్ శాంతికుమారి, ఐటీ, పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమలశాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు వెళ్లనున్నారు. మరోవైపు 4న మంత్రి శ్రీధర్‌బాబు, 5న మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా అమెరికా పర్యటనకు బయలుదేరుతారు. వీరు అక్కడ రేవంత్ బృందంతో కలుస్తారు. 9వ తేదీ వరకు న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కో నగరాల్లో పర్యటించి పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అవుతారు. ఈ సందర్భంగా పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలున్నాయి. అమెరికాలోని ప్రవాస భారతీయులతోనూ సమావేశమవుతారు. 10న అమెరికా నుంచి బయలుదేరి 11న దక్షిణ కొరియాలోని సియోల్ నగరానికి చేరుకుంటారు. అక్కడా ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు. 14న రాష్ట్రానికి తిరిగొస్తారు. రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జనవరి 15 నుంచి 19 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు. పెట్టుబడుల కోసం విదేశాల్లో పర్యటించడం ఇదే తొలిసారి.