కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 338కి చేరింది. మరో 300 మందికి పైగా గల్లంతయ్యారు. వయనాడ్‌లో సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. రిలీఫ్, రెస్క్యూ సిబ్బంది ప్రస్తుతం శిథిలాలలో ప్రాణాలతో ఉన్నవారి కోసం.. మృతదేహాల కోసం వెతకడంలో బిజీగా ఉన్నారు. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ప్రకృతి విపత్తుతో నిర్జీవంగా మారిన కేరళలోని వయనాడ్ ఇంకా కోలుకోలేకపోతోంది. ఐదు రోజులుగా సహాయక చర్యలు సాగుతూనే ఉన్నాయి. శిథిలాలు, బురద తవ్వి తీస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 338 డెడ్‌బాడీలను సహాయక బృందాలు గుర్తించాయి. ఇంకా 300కు పైగా ప్రజలు గల్లంతయ్యారు. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఐదు రోజులుగా దాదాపు 40 సహాయక బృందాలు ఈ వయనాడ్‌లో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. మండుక్కై, చూరాల్‌మల, అట్టమాల,నూల్పుజ ప్రాంతాల్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌లో వందల మందిని అధికారులు కాపాడి ఆసుపత్రులకు తరలించారు. ఈ సహాయక చర్యలు మరింత వేగంగా సాగాలని 190 అడుగుల వంతెననే సైన్యం నిర్మించింది. ఈ వంతెన నిర్మాణంతో సహాయక చర్యలు మరింత వేగం పుంజుకున్నాయి. మేజర్ జనరల్ వీటి మాథ్యూ, జీవోసీ కర్ణాటక-కేరళ సబ్ ఏరియా సిబ్బింది ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. ఇరవై నాలుగు టన్నుల బరువును ఈ బ్రడ్జి మోయగలదు. దీని కోసం నిర్మాణ సామగ్రిని ఢిల్లీ, బెంగళూరు నుంచి తెప్పించారు.
గల్లంతైన వారి కోసం రెస్క్యూ సిబ్బంది స్నిఫర్ డాగ్స్ తో గాలిస్తున్నారు. దీంతోపాటు రాడార్ డ్రోన్లు, థర్మల్ స్కానర్లు వంటి సాంకేతిక పరికరాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేయనున్నారు. సహాయక చర్యల్లో అదనపు దళాలను కూడా ఉపయోగించాలని యోచిస్తున్నారు. ఇప్పటి వరకు 279 శవపరీక్షలు పూర్తి చేశారు వైద్యులు. ఇంకా గుర్తించిన వారి డెడ్‌బాడీలు ఉన్నాయి.
మరోవైపు భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలు కేరళ వాసులను అధికారులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఆ రోజు ప్రమాదానికి ముందు కూడా ఇలాంటి హెచ్చరికలు జారీ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్రం మధ్య వివాదం నెలకొన్న వేళ ఐఎండీ చీఫ్ కీలక ప్రకటన చేశారు.