ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన రేవంత్‌రెడ్డి… పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రతిపాదనలు కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ రాష్ట్రానికి 29 అదనపు ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని కేంద్ర హోం శాఖ మంత్రిని కోరారు. తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలు, వరద వల్ల నష్టపోయిన మౌలిక వసతుల పునరుద్ధరణ, మరమ్మతుల కోసం 11 వేల 713 కోట్లు విడుదల చేయాలని సీఎం రేవంత్ కోరారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల నుంచి తొలగించిన ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలను ఎల్‌డబ్ల్యూఈలో తిరిగి చేర్చాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకి విజ్ఞప్తి చేశారు.
పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర పునర్విభన సమస్యల పరిష్కారానికి సహకరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరారు. ముఖ్యంగా షెడ్యూల్ 9లోని ప్రభుత్వ భవనాలు, కార్పొరేషన్ల పంపిణీ, షెడ్యూల్ పదిలోని సంస్థల వివాదం సామరస్యపూర్వక పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక, పునర్విభజన చట్టంలో ఎక్కడా పేర్కొనని ఆస్తులు, సంస్థలను ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేసుకుంటున్నందున, వాటిలో తెలంగాణకు న్యాయం జరిగేలా చూడాలని కేంద్ర మంత్రి షాను కోరారు సీఎం రేవంత్.
మూసీ ప్రక్షాళన విషయంలో దూకుడు మీదున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్ నగరంలోని సీవరేజ్‌ను మూసీలో కలవకుండా చూసేందుకు ఉద్దేశించిన హైదరాబాద్ సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్‌కు కేంద్ర ప్రభుత్వం సాయం కోరారు. మాస్టర్ ప్లాన్‌ను అమృత్ 2.0లో చేర్చి ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను అభ్యర్థించారు. హైదరాబాద్‌తో పాటు సమీప 27 పురపాలక సంఘాలతో కలుపుకొని 7 వేల 444 కి.మీ మేర రూ.17 వేల 212 కోట్లతో CSMPకి డీపీఆర్‌ను రూపొందించినట్లు తెలిపారు. సదరు డీపీఆర్‌ను కేంద్ర మంత్రికి సీఎం అందజేశారు.
ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ ప్రజల జీవన ప్రమాణాలు ఉండాలనే లక్ష్యంతో నగరంతో పాటు సమీప మునిసిపాలిటీలలో 100 శాతం ద్రవరూప వ్యర్థాలను శుద్ధి చేయాలని తమ ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు. హైదరాబాద్‌లో మురుగు శుద్ధి వ్యవస్థ పురాతనమైనదని, ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా లేదని తెలిపారు. సమీప పురపాలక సంఘాల్లోనూ సరైన మురుగు నీటి పారుదల వ్యవస్థ లేదని చెప్పారు. హైదరాబాద్‌లో మూసీ నది 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోందని, దానికి ఇరువైపులా కలిపి 110 కిలోమీటర్ల మేర నగరంలోని మురుగు అంతా మూసీలోనే చేరుతోందని వివరించారు. ఈ మురుగు మూసీలో చేరకుండా ఉండేందుకు ట్రంక్ సీవర్స్ మెయిన్స్, లార్జ్ సైజ్ బాక్స్ డ్రెయిన్స్, కొత్త సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి రూ.4 వేల కోట్లతో డీపీఆర్‌ను రూపొందించినట్లు చెప్పారు. డీపీఆర్‌ను ఆమోదించాలని, పనుల అనుమతికి చొరవ చూపాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ మెట్రో రెండో దశలో భాగంగా ఐదు కారిడార్లలో 76.4 కిలోమీటర్ల మేర డీపీఆర్‌లు పూర్తయినట్టు ఖట్టర్‌కు రేవంత్ వివరించారు. ఈ కారిడార్ల నిర్మాణానికి రూ.24,269 వ్యయం అవుతుందని అంచనా వేశామని, కేంద్రం సగం భరించాలని కోరారు. త్వరలోనే డీపీఆర్‌ను సమర్పిస్తామని చెప్పారు. ప్రాజెక్టు త్వరగా కార్యరూపం దాల్చేందుకు సహకరించాలని కోరారు.