సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ఈ మీటింగ్‌లో కీలక నిర్ణయాలపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా రైతు భరోసా విధివిధానాలపై చర్చిస్తున్నారు. పంట వేసిన వారందరికీ రైతు భరోసా ఇవ్వాలని ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసింది. ఆదాయపు పన్ను చెల్లింపు, ఎకరాల పరిమితి లేకుండా చేయాలని ప్రతిపాదించింది. ఈ మంత్రి వర్గంలో రైతు భరోసాపై నిర్ణయం తీసుకోనున్నారు.
కొత్త రేషన్ కార్డుల జారీ, ఆదాయ పరిమితిపై కూడా చర్చిస్తున్నారు. ఇక సన్న బియ్యం పంపిణీపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇళ్లు, లబ్ధిదారుల సబ్సిడీ ధరలతో ఇసుక, సిమెంట్, స్టీల్ సరఫరా చేయాలన్న ప్రతిపాదనపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. యాదగిరిగుట్ట దేవాలయానికి ప్రత్యేక బోర్డు, టీటీడీ తరహాలో పాలక మండలి ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి. కొత్త టూరిజం పాలసీ, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ.. ఎస్సీ వర్గీకరణ నివేదిక, సాగునీటి సంఘాలపై మంత్రి మండలిలో చర్చిస్తున్నారు. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన కులగణన నివేదిక, విద్యుత్ కొనుగోళ్ల నివేదికపై కూడా కేబినెట్ భేటీలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.