ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీల మధ్య పొత్తు ఫిక్స్ అయ్యింది. సుధీర్ఘ భేటీ అనంతరం ఎట్టకేలకు మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరినట్లు శనివారం మూడు పార్టీల అధ్యక్షులు అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమిలో తిరిగి ఆరేళ్ల తర్వాత జాయిన్ కావడంపై చంద్రబాబు ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ఎన్డీఏ కూటమిలో తిరిగి చేరడం సంతోషంగా ఉందన్నారు చంద్ర బాబు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, తెలుగు ప్రజల సంక్షేమానికి తెలుగు దేశం పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీల కేవలం పొత్తు మాత్రమే కాదని.. రాష్ట్ర, దేశాభివృద్ధికి పాటుపడే భాగస్వామ్య కూటమి అని అన్నారు. ఏపీ ప్రజలు తమకు సేవ చేసేందుకు చారిత్రాత్మకతీర్పుతో అధికా రాన్ని అందిస్తారని ఆశిస్తున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, స్వర్ణయుగానికి కృషి చేస్తామన్నారు. ప్రధాని మోడీతో కలిసి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ట్విట్టర్ వేదికగా తెలుగులో ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ దార్శనికతతో కూడిన నాయకత్వం ఎన్డీఏలో అందరినీ కలుపుకొని పోయి రాజకీయాలకు బలమైన వేదికగా నిరంతరం అభివృద్ధి చెందుతోందని అన్నారు. మోదీ నాయకత్వం పై తమకున్న నమ్మకాన్ని ధృవీకరిస్తూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఎన్డీయేలో చేరాయని తెలిపారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లను ఎన్డీఏలోకి స్వాగతిస్తున్నానని అమిత్ షా అన్నారు. వారితో భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను వేగవంతం చేస్తుందని అని అమిత్ షా ట్వీట్ చేశారు.


