స్వతంత్ర వెబ్‌డెస్క్: ఆప్ సీనియర్ నేత సత్యేందర్ జైన్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. శుక్రవారం న్యాయస్థానం ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఆరోగ్య స్థితి పరిగణలోకి తీసుకున్న సుప్రీం కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన తిహాడ్ జైల్లో ఉన్న జైన్ ఆరోగ్యం మరింత క్షిణించింది. జైలు గదిలోని బాత్‌రూమ్‌లో స్పృహతప్పి పడిపోయారు. దీంతో జైలు అధికారులు వెంటనే ఆయన్ను దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, అక్కడ ఆయన పరిస్థితి విషమించడంతో నగరంలోని ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో ఆయన చికిత్స పొందుతున్నారని జైలు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఈ క్రమంలో మరోసారి జైన్ అస్వస్థతకు గురికావడంతో.. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున పిటిషన్ వేసిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ.. జైల్లో ఉన్న సమయంలో జైన్ 35 కిలోల బరువు తగ్గారని ధర్మాసనం ముందు విన్నవించారు. పరిగణనలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం.. పిటిషన్ అత్యవసర విచారణ కోసం వెకేషన్ బెంచ్‌ను ఆశ్రయించేందుకు అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే తాజాగా మధ్యంతర బెయిల్ మంజూరైంది.