స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: అమరావతిలో పేదలకు ఇచ్చే స్థలాల్లో ఇళ్ల నిర్మాణం ఈ వారంలోనే ప్రారంభిస్తామని సీఎం జగన్ తెలిపారు. వెంకటపాలెంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇస్తున్నది ఇళ్ల పట్టాలు మాత్రమే కావని సామాజిక న్యాయ పత్రాలన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసి విజయం సాధించామని పేర్కొన్నారు.
మూడు పద్ధతుల్లో ఇళ్లు నిర్మిస్తామని.. తొలి విధానంలో సొంతంగా ఇల్లు కట్టుకునే వారికి రూ.1.80వేలు ఇస్తామని, రెండ విధానంలో నిర్మాణ కూలీ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని వివరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 98శాతం అమలు చేశామన్నారు.
ఇక ప్రతిపక్షాలపై జగన్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, కొన్ని దినపత్రికలు, న్యూస్ ఛానెల్స్‌ను గజదొంగల ముఠాగా అభివర్ణించారు. నరకాసురుడిని అయినా నమ్మొచ్చేమో కానీ చంద్రబాబును నమ్మడానికి వీల్లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని విమర్శించారు. 2014 నుంచి 2019 వరకు పేదలకు చంద్రబాబు ఒక్క పట్టా కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు.