సెమీ హైస్పీడ్ రైలుగా పట్టాలపైకి ఎక్కిన వందేభారత్ రైళ్లపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలో ఏదో ఒక చోట గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడులు చేస్తూనే ఉన్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుపై గూడూరు సమీపంలో రాళ్ల దాడి జరిగింది. కొందరు దుండగులు వేగంగా దూసుకెళ్తున్న రైలుపై రాళ్లు విసిరారు. ఈ దాడిలో రైలు బోగీ అద్దం పగిలినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రేణిగుంట పోలీసులకు రైల్వే సిబ్బంది ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు మోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడిన వారి కోసం గాలిస్తున్నారు. కాగా సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ రైలుపై కూడా పలుమార్లు రాళ్ల దాడి జరిగింది.