తెలంగాణ ఎన్నికలకు మరో ఐదు నెలలే సమయం ఉండడంతో రాజకీయ పార్టీలు తమ వ్యుహాలకు పదునుపెడుతున్నాయి. ఇతర పార్టీల్లో బలంగా ఉన్న నేతలను తమ పార్టీలోకి చేర్చుకునేలా మంతనాలు జరుపుతున్నాయి. ఈ క్రమంలోనే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో తనపై విధించిన పార్టీ బహిష్కరణను ఎత్తివేయకపోవడంతో ఆయన టీడీపీలో చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ను కలిసి చర్చలు జరిపినట్లు సమాచారం. గోషామహల్ నియోజకవర్గంతోపాటు మరో మూడు స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థుల గెలుపు బాధ్యతను తాను తీసుకుంటానని రాజాసింగ్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో రెండు, మూడు రోజుల్లోనే ఆయన పసుపు కండువా కప్పుకోనున్నట్లు రాజాసింగ్ వర్గీయులు భావిస్తున్నారు.
కాగా టీడీపీ నుంచే రాజాసింగ్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2009లో టీడీపీలో చేరిన ఆయన కార్పొరేటర్ గా గెలిచారు. రాష్ట్ర విభజన అనంతరం బీజేపీలో చేరి 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రికార్డు నెలకొల్పారు. తెలంగాణలో మళ్లీ పాగా వేయాలని తహతహలాడుతున్న టీడీపీకి రాజాసింగ్ చేరిక మరింత బలం చేకూరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.