స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: పోటీలో నిలవాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అదరగొట్టింది. చివరి బంతికి సిక్సర్ కొట్టి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆఖరి బాల్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో దిగ్విజయంగా పైచేయి సాధించింది. అసలు సిసలైన ఐపీఎల్ మజాను ప్రేక్షకులకు అందించింది. నరాలు తెగే టెన్షన్ తో సాగిన ఆటలో హైడ్రామా నడుమ ఓడి గెలిచింది.
రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచులో భారీ లక్ష్యాన్ని ఛేధించే క్రమంలో చివరి బంతికి 5పరుగులు కావాలి. క్రీజులో అబ్దుల్ సమద్ బ్యాటింగ్ చేస్తుండగా.. యార్కర్ల స్పెషలిస్ట్ సందీప్ శర్మ బౌలింగ్ చేస్తున్నాడు. సమద్ భారీ షాట్ కొట్టే యత్నంలో లాంగ్ ఆఫ్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
అంతే రాజస్థాన్ డగౌట్ లో జోరు.. హైదరాబాద్ జట్టులో నైరాశ్యం. కానీ ఆ బాల్ నోబాల్ అని అంపైర్ సైరన్ మోగించగానే సన్ రైజర్స్ టీంలో మళ్లీ ఆశలు రేగాయి. ఇక 4 పరుగులు కావాల్సి ఉండగా.. సమద్ ఈసారి బంతిని నేరుగా సిక్స్ కొట్టి హైదరాబాద్ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
అంతకుముదు తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 214 పరుగులు చేసింది. జోస్ బట్లర్ 95 పరుగులతో వీరవిహారం చేయగా.. కెప్టెన్ సంజూ శాంసన్ 66 పరుగులతో దుమ్మురేపాడు. దీంతో ఆ జట్టు భారీ స్కోర్ నమోదుచేసింది.
215 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన సన్ రైజర్స్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్లు అన్ మోల్ ప్రీత్ సిగ్(33), అభిషేక్ శర్మ(55) శుభారంభం అందించగా.. వన్ డౌన్ లో వచ్చిన రాహుల్ త్రిపాఠి(47) రన్స్ చేసి జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. హెన్రిచ్ క్లాసెన్(26) తనవంతు సహకారం అందించాడు.
చివరి 2ఓవర్లలో 41 పరుగులు కావాల్సిన తరుణంలో గ్లెన్ ఫిలిప్స్ 6,6,6,4 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేశాడు. ఆఖరి ఓవర్లో 17 పరుగులు కావాల్సిన సమయంలో సమద్ ఆ పని పూర్తి చేశాడు. ఈ క్రమంలో నో బాల్ హైదరాబాద్ టీంకు కలిసివస్తే.. రాయల్స్ జట్టుకు షాక్ ఇచ్చింది.