స్వతంత్ర వెబ్ డెస్క్: కేంద్ర బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి సోము వీర్రాజును తొలగించారు. ఈ విషయమై జేపీ నడ్డా కొద్దిసేపటి క్రితం సోము వీర్రాజుకు ఫోన్ చేశారు. ‘మీ పదవీకాలం ముగిసింది.. మిమ్మల్ని మిస్ అవుతున్నాం.. మీరు రాజీనామా చేయండి’ అని నడ్డా తనకు సూచించినట్లు వీర్రాజు స్వయంగా తెలిపారు. సోముకు కొత్త బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. 1978 నుంచి సోము వీర్రాజు భాజపాలో కొనసాగుతున్నారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో 2020 జులై 27న ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సత్యకుమార్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. చాలా రోజులుగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిని మార్చడంపై చర్చ జరుగుతోంది.
ఏపీ అధ్యక్షుడిని మార్చాలని భాజపా అధినాయకత్వం భావిస్తున్నట్లు గతకొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు సోము వీర్రాజుపై రాష్ట్రానికి చెందిన కొంతమంది నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు కొన్ని రోజులుగా కేంద్రమంత్రివర్గంలో మార్పులు చేర్పులు.. వివిధ రాష్ట్రాల అధ్యక్షుల మార్పుపై బీజేపీ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఏపీలో మరో 9 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొత్త అధ్యక్షుడితోనే ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ అధినాయకత్వం భావించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సోము వీర్రాజును తప్పించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడిని సాయంత్రం లేదా రేపు ప్రకటించే అవకాశముంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నందున నాయకత్వ మార్పులపై చర్చ సాగుతోంది. ఈ ఏడాది చివర్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే పార్టీని బలోపేతం చేసేందుకు అధ్యక్షుడిని మారుస్తున్నారు. మరి బీజేపీ మార్పులు చేర్పులు ఏ మేరకు లాభపడతాయో చూడాలి.