స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై కొందరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యంగా ఉన్నారని.. అతని తల్లికి ఆరోగ్యం బాగోలేదని సీబీఐకి ఆయన సమాచారం ఇచ్చి ఉంటారని అన్నారు. సీబీఐ పిలిచిన ప్రతీసారి అవినాష్ రెడ్డి వెళ్లారని.. మీడియాపై జరిగిన దాడి దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
వివేకా హత్య కేసులో అవినాష్ పాత్ర ఉంటే చంద్రబాబు వదిలేవారా? ఏం జరిగిందో వీళ్లకు తెలిసి ఉంటే సీబీఐ వీళ్ళని పిలిచి విచారించాలి అని డిమాండ్ చేశారు. అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తారనే వార్తలు ఊహాజనితాలేనని అన్నారు. అవినాష్ రెడ్డికు ముందస్తు బెయిల్ కేసు సుప్రీంకోర్టులో ఉందని తెలిపారు. అవినాష్ రెడ్డి పారిపోతున్నట్లు చిత్రీకరిస్తున్నారని.. అతని తల్లికి అనారోగ్యం ఉందని క్రియేట్ చేసే దౌర్భాగ్యం అవినాష్‌కు లేదని అన్నారు. వివేకా హత్య తర్వాత రక్తపు మరకలు ఎవరు తుడిచారో, ఆయన రాసినట్లు చెబుతోన్న లేఖను ఎవరెందుకు దాచారో అందరికీ తెలుసని అన్నారు. తప్పు చేసిన వారెవరూ తప్పించుకోలేరు అంటూ సజ్జల వ్యాఖ్యానించారు.