సోషల్ మీడియాను బలమైన ఆయుధంగా వాడుకొని .. ప్రజా సమస్యలపై పోరాడాలని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై ఆరు నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను, మేనిఫెస్టోలో హామీలను పూర్తిగా గాలికొదిలేశారని కూటమి నేతలపై విరుచుకుపడ్డారు. ప్రతి ఇంట్లో ఇదే చర్చ జరుగుతోందన్నారు. వైసీపీ హయాంలో ఇచ్చిన పథకాలను రద్దుచేశారని.. , అవి అమలు కావడం లేదని అన్నారు.
రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిత్వం, విశ్వసనీయ ఉండాలి. అలాంటి వారికే విలువ ఉంటుంది. అందుకనే మనం అబద్ధాలు చెప్పలేకపోయాం. ఎన్నికల సమయంలో మేనిఫెస్టో సందర్భంగా ప్రజంటేషన్ ఇచ్చాను. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మేనిఫెస్టోను మనం అమలు చేశాం. మనం చేస్తున్న హామీలకు ఇంత ఖర్చు అవుతోంది, చంద్రబాబు హామీల అమలు చేయాలంటే రూ.1.72లక్షల కోట్లు ఇవ్వాలి అని చెప్పాను. చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్రలేపడమే అని చెప్పాను. పులినోట్లో తలకాయ పెట్టడమే అని చెప్పాను. ఇవాళ ఆ వీడియోలు చూస్తే.. జగన్ కరెక్టుగానే చెప్పాడనుకునే పరిస్థితి వచ్చింది.
చంద్రబాబుకూ, జగన్‌కూ మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారు. ఏ పథకమైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు డోర్ డెలివరీ జరిగేది. మరి చంద్రబాబు కాలంలో ఎందుకు ఇలా జరగడంలేదు?. ఎందుకు చంద్రబాబు మనలా చేయలేకపోతున్నాడు?. మరోవైపు బాదుడే బాదుడు కనిపిస్తోంది. ఆరునెలలు తిరక్కముందే కరెంటు ఛార్జీలు భారీగా పెంచారు. గ్రామీణ రోడ్లలో టోల్‌గేట్లు కూడా పెడుతున్నారు. నేషనల్ హైవేల మీదలానే టోల్ కట్టాల్సిన పరిస్థితి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నాయి. స్థలాల్లోని పాత ఇళ్ల మీద కూడా ఛార్జీలు వేస్తున్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్ డబ్బులు చెల్లించడంలేదు. విద్యా దీవెన, వసతి దీవెన కింద రూ.3900 కోట్లు పెండింగ్‌లో పెట్టారు. ఆరోగ్యశ్రీ కింద వేయి ప్రొసీజర్లను 3300 వరకూ పెంచి గొప్పగా అమలు చేశాం. ఈ 8 నెలల కాలంలోనే రూ.3వేల కోట్లు ఆరోగ్యశ్రీకి బకాయిపెట్టారు.
ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. రైతులకు పెట్టుబడి సహాయం కింద ఇస్తానన్న రూ.20వేలు ఇవ్వలేదు. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిపాలన.. ఈ నాలుగు రంగాలను చూసుకోవడమే ప్రభుత్వం బాధ్యత. కాని ఈ నాలుగు రంగాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. ఇంటివద్దకే డోర్ డెలివరీ పరిపాలనుంచి తిరిగి టీడీపీ నాయకుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి.
మనం ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. పార్టీని బలోపేతం దిశగా చర్యలు తీసుకుంటున్నాం. పార్టీని వ్యవస్థీకృతంగా తీర్చిదిద్దాలి. ప్రతి గ్రామంలో కూడా పార్టీ నిర్మాణం ఉండాలి.
నేను కూడా జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యటనకు వస్తాను. ప్రతి వారంలో మూడు రోజులు ఒక పార్లమెంటు పరిధిలో విడిది చేస్తాను. ప్రతి రోజూ రెండు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలను కలుసుకుంటాను. మండలస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ పార్టీ బలోపేతం కావాలి. గ్రామస్థాయి కమిటీలు, బూత్ కమిటీలు ఇవన్నీకూడా బలోపేతం కావాలి. సోషల్ మీడియాను బలమైన ఆయుధంగా ఉపయోగించుకోవాలి.
కేవలం మనం చంద్రబాబుతో యుద్ధం చేయడం లేదు. వీరిని ఎదుర్కోవాలంటే.. సోషల్‌మీడియా ద్వారానే సాధ్యం. గ్రామస్థాయిలో ఉన్న ప్రతి కమిటీసభ్యుడు కూడా సోషల్ మీడియాను వినియోగించుకోవాలి. ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకురావాలి. అన్యాయాలు, అక్రమాలపై ప్రశ్నించాలి. ఇచ్చిన హామీల అమలుకు పట్టుబట్టాలి.. అని జగన్ దిశానిర్దేశం చేశారు.