స్వతంత్ర, వెబ్ డెస్క్: మీకు టీతో పాటు సిగరెట్ తాగే అలవాటుందా? మద్యం తాగుతూ స్మోక్ చేస్తున్నారా? చాలా మంది ఒక సిప్ టీ.. మరో పఫ్ దమ్ము వదులుతూ రిలాక్స్ అవుతుంటారు. మరికొంతమంది మద్యం తాగేటప్పుడు కూడా సిగరెట్ తాగుతారు. ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్‌లోని శాస్త్రవేత్త డాక్టర్ షూమేకర్ నివేదిక ప్రకారం టీ, మద్యం తాగేటప్పుడు సిగరెట్ తాగడం అత్యంత ప్రమాదకరమని తెలిపారు. దీని వల్ల అన్నవాహిక క్యాన్సర్ ప్రమాదం వచ్చే అవకాశాలు 30శాతం ఎక్కువగా ఉంటాయన్నారు. టీ, కాఫీలో కెఫిన్, సిగరెట్‌లో నికోటిన్ ఉంటుంది కాబట్టి వీటిని కలిపి తీసుకుంటే ఊపిరితిత్తుల పనితీరు నెమ్మదిస్తుందని పేర్కొన్నారు.
సిగరెట్ పొగలో కార్బన్ మోనాక్సైడ్ వాయువు ఉండడం వల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయి పడిపోతుంది. అంతేకాదు కాఫీ, టీ, మద్యంతో పొగ తాగడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుందన్నారు. ఊపిరితిత్తులను మాత్రమే కాకుండా శరీరంలోని ఇతర భాగాలను కూడా ప్రభావితం చేస్తుందని హెచ్చరించారు. సిగరెట్ కనీసం ఒక సంవత్సరం పాటు మానేస్తేనే అవయవాల పనితీరు సాధారణ స్థితికి వస్తాయని వెల్లడించారు. అలా కాకుండా నెల, రెండు నెలలు మానేసినా లాభం ఉండదని స్పష్టంచేశారు.