విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొనేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సింగరేణి ప్రతినిధుల బృందం వైజాగ్ లో పర్యటిస్తోంది. సింగరేణి కాలరీస్ కు చెందిన ముగ్గురు డైరెక్టర్లు, ఇద్దరు జీఎంలు ప్లాంట్ లోని మార్కెటింగ్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈనెల 15లోగా బిడ్డింగ్ వేయాల్సి ఉండడంతో ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్(EOI) సాధ్యాసాధ్యాలపై చర్చించారు. అయితే ప్లాంట్ సీఎండీ ఢిల్లీ పర్యటనలో ఉండడంతో ఆయనతో రేపు భేటీ కానున్నారు. ఈలోపు ఆయన ఆదేశాల మేరకు ప్లాంట్ పరిసరాలను తెలంగాణ బృందం పరిశీలించింది. రేపు సీఎండీతో చర్చించిన తర్వాత బిడ్డింగ్ పై నివేదికను తెలంగాణ సీఎం కేసీఆర్ కు అధికారులు అందించనున్నారు. ఆ నివేదిక ప్రకారం ప్రభుత్వం బిడ్డింగ్ పై తుది నిర్ణయం తీసుకుంది.
సింగరేణి అధికారులు విశాఖ స్టీల్ ప్లాంట్ కు రావడంపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఏపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేణీకరణకు పూర్తి వ్యతిరేకమని తెలిపారు. మొన్నటిదాకా ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించిన తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు బిడ్డింగ్ లో పాల్గొంటామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు కేసీఆర్ సర్కార్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమా? కాదా? స్పష్టత ఇవ్వాలని మంత్రి గుడివాడ డిమాండ్ చేశారు.