స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపింది. దీంతో ఆయన రేపు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన సిద్ధరామయ్య.. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. 1983లో తొలుత స్వతంత్ర అభ్యర్థిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన.. జనతాదళ్, జనతాదళ్ యునైటెడ్ పార్టీల్లో పనిచేశారు. అనంతరం 2006లో కాంగ్రెస్ పార్టీలో చేరి కీలకనేతగా ఎదిగారు.
ఇప్పటివరకు ఆయన 9సార్లు ఎమ్మెల్యేగా.. 3సార్లు మంత్రిగా.. ఒకసారి సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. 2013 నుంచి 2018 వరకు పూర్తిసాయిలో ముఖ్యంత్రిగా పనిచేసిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 1983 లో చాముండేశ్వరీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. తర్వాత 1985 మధ్యంతర ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి గెలుపొంది మంత్రి అయ్యారు. 1989లో జనతాదళ్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. అయితే 1994 ఎన్నికల్లో అదే పార్టీ నుంచి గెలుపొంది మరోసారి మంత్రివర్గంలో స్థానం సంపాదించుకోవడంతో పాటు 1996లో ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టారు.
ఇక 2004 ఎన్నికల్లో జేడీఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనను ఆ పార్టీ అధినేత జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ 2005లో పార్టీ నుంచి బహిష్కరించారు. అనంతరం 2006లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి కాంగ్రెస్ లో కీలక నేతగా ఎదిగారు. 2013లో తొలిసారిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో మరోసారి విజయం సాధించిన సిద్ధరామయ్య రెండోసారి కర్ణాటక రాష్ట్రానికి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు.