విశాఖ యువతి శ్వేత మృతి కేసులో సంచలన విషయాలను సీపీ త్రివిక్రమ్ వర్మ వెల్లడించారు. శ్వేత పేరుతో ఉన్న 90సెంట్ల భూమి తన పేరుపై రాయాలని భర్త మణికంఠ కొట్టేవాడని తెలిపారు. అందరి ముందు ఓ సారి శ్వేత గొంతు పట్టుకున్నాడని.. ఆమె ఆపడుచులు కూడా వేధించేవారని పేర్కొన్నారు. శ్వేతను చిన్న చూపు చూసేవారని.. ఆడపడుచు భర్త సత్యం కూడా శ్వేతను లైంగిక వేధింపులకు గురిచేశాడన్నారు.
దీంతో గతంలోనే శ్వేత ఆత్మహత్యాయత్నం చేసిందని చెప్పారు. వేధింపులు ఎక్కువ కావడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. శ్వేత శరీరంపై గాయాలేవని పోస్టుమార్టం రిపోర్టులో తేలిందని సీపీ చెప్పారు. భర్త, అత్తమామలపై వరకట్నం, ఆడపడుచు భర్తపై లైంగిక వేధింపుల కేసులు నమోదుచేశామన్నారు. కాగా శ్వేత మృతదేహాన్ని పుట్టింటి బంధువులకు అప్పగించడంతో గురువారం అంత్యక్రియలు నిర్వహించారు.