స్వతంత్ర వెబ్ డెస్క్: బీజేపీ సీనియర్ నేత, మేనకాగాంధీకి బిగ్ షాక్ తగిలింది. ఎంపీ మేనకా గాంధీపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేసేందుకు ఇస్కాన్ సిద్ధమైంది. ఈ మేరకు నోటీసులు జారీ అయ్యాయి. అయితే, ఇటీవల మేనకా గాంధీ.. గోశాలల్లో ఉన్న గోవుల్ని ఇస్కాన్ అమ్ముకుంటున్నదని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో, ఇస్కాన్ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఇక, మేనకా గాంధీ వ్యాఖ్యలపై కోల్‌కతాలోని ఇస్కాన్ ఉపాధ్యక్షుడు రాధారమణ్ దాస్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. మేనకా గాంధీ వ్యాఖ్యలు దురదృష్టకరమని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ భక్తుల్ని ఆమె వ్యాఖ్యలు బాధించాయన్నారు. ఆమెపై వంద కోట్ల పరువునష్టం కేసు వేసేందుకు న్యాయ ప్రక్రియ చేపట్టామని, ఇవాళ ఆమెకు నోటీసు జారీచేశామని చెప్పుకొచ్చారు. మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ అయిన ఆమె ఎటువంటి ఆధారాలు లేకుండా ఇంత పెద్ద సంస్థపై ఎలా ఆరోపణలు చేశారని ఆయన మండిపడ్డారు.
అంతకుముందు కూడా.. మేనకా గాంధీ చేసిన ఆరోపణలను ఇస్కాన్ ఖండించింది. ఆమె ఆరోపణలు నిరాధారమైనవని, తప్పుడువని ఇష్కాన్ పేర్కొన్నది. గోవులు, ఆవుల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ఇస్కాన్ జాతీయ ప్రతినిధి యుదిష్టర్ గోవింద దాస్ తెలిపారు. కేవలం ఇండియాలోనే కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా తాము గోవుల్ని ఆదరించనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. మేనకా గాంధీ ఇస్కాన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఇస్కాన్ వాళ్లు దేశంలోనే దారుణమైన మోసాలకు పాల్పడుతున్నారని.. గోశాలల నిర్వహణ పేరిట ఆవుల్ని కసాయివాళ్లకు అమ్మేసుకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణలే చేశారు. ఇస్కాన్.. దేశంలోనే అతిపెద్ద మోసపూరిత సంస్థ. ఇది గోశాలలను నిర్వహణ పేరిట ప్రభుత్వాల నుంచి లబ్ధి పొందుతోంది. ఓ చోట ఉన్న ఇస్కాన్ గోశాలకు వెళ్లినప్పుడు అక్కడ ఒక ఆవు కూడా లేదు. అన్నింటిని కసాయివాళ్లకు అమ్మేశారు. అలాంటి వాళ్లు రోడ్లపైకి చేరి హరేరామ్.. హరేకృష్ణ అంటూ వల్లేస్తుంటారు. పాల మీదే ఆధారపడి బతుకుతున్నాం అని చెప్పుకుంటారు అని ఆరోపించారు.