కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్ని శాఖల సమీక్షలపై ఫోకస్ పెట్టారు. కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పవన్.. గత ఐదేళ్లు ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఏంటని అడిగి తెలుసుకున్నారు. మహిళా సమాఖ్యలు, స్వయం సహాయక సంఘాలకి అందిన ప్రోత్సాహాలపై ఆరా తీశారు. పెట్టుబడి నిధి, వడ్డీ రాయితీలు ఎలా ఇస్తున్నా రని అడిగి తెలుసుకున్నారు. ఇక, గ్రామాల్లో ఏ నిష్పత్తిలో నిధులు ఖర్చు పెడుతున్నారని అధికారులను ప్రశ్నించారు పవన్. పన్నులు వసూలు ఆశించిన స్థాయిలో లేదన్నారు. త్రాగునీటి కోసం ఎంత ఖర్చు అవుతుందని పవన్ ప్రశ్నించారు. గ్రామాల్లో త్రాగునీటి సౌకర్యంపై ఫోకస్ పెట్టాలని, దానికి ఎలాంటి కార్యాచరణ అవసరం అనేదానిపై సమావేశంలో చర్చించారు. గ్రామీణ స్థాయిలో మంచినీటి పరీక్షలు, మంచినీటి ట్యాంకుల కో-ఆర్డినేషన్, జలజీవన్ మిషన్ పనులు. తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితిని అధికారులను అడిగితెలుసుకున్నారు డిప్యూటీ సీఎం.
మరోవైపు అటవీ శాఖ అధికారులు రివ్యూలో పవన్ కీలక వ్యాఖ్యలు చేవారు. కాకినాడలో మడ అడవులు ధ్వంసం చేస్తున్నా, అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? అని ప్రశ్నించారు. 90 ఎకరాలలో మడ అడవులు ఉంటే 58 ఎకరాలు కొందరు అక్రమార్కులు లేఅవుట్ గా మార్చేస్తే మీకు సంబంధం లేదా? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను కూడా పాటించరా? అని నిలదీశారు. అధికారులు ప్రభుత్వం కోసం కాదు ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయాలని స్పష్టం చేశారు. కోరింగ అభయారణ్యంలో సారా తయారీ జరుగుతుందని సమాచారం ఉంది. అసాంఘిక కార్యకలాపాలు జరిగితే జీవరాశులు మనుగడ ఉండదు కదా? అని మండిపడ్డారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.