ఆ ఏటీఎంలో చోరీ పోలీసులకు సవాల్‌గా మారింది. ఎలాంటి క్లూ దొరకలేదు. దీంతో పోలీసులు పాత నేరస్తులు, సీసీ ఫుటేజిల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
కామారెడ్డి జిల్లా పిట్లంలో ఈ నెల 12న తెల్లవారు జామున ఎస్బీఐ ఏటీఎంను దొంగలు లూటీచేశారు. గ్యాస్ కట్టర్ల సాయంతో మిషన్‌ను కట్‌చేసి, దాని నుండి 17. 70 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. ఇతర రాష్ట్రాలకు చెందిన నలుగురు ముఠా ఈ దోపిడీ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఏటీఎంలోకి ఇద్దరు వెళ్లగా కారులో ఒకరు ఉన్నట్లు భావిస్తున్నారు. మరో వ్యక్తి కాపలాగా ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
ఏటీఎంను లూటీ చేసిన అనంతరం దొంగలు 161వ నెంబర్ జాతీయ రహదారి మీదుగా కారులో పారిపోయారు. ఈ ముఠా టోల్‌గేట్ మీదుగా కాకుండా సమీప మారుమూల గ్రామాల నుండి వెళ్లినట్లు తెలుస్తోంది. ఏటీఎంలో ప్రవేశించిన ఈ ముఠా ముఖం కనిపించకుండా బట్టతో కట్టేసుకున్నారు. ఈ చోరీ జరిగిన తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్‌టీం ద్వారా వేలిముద్రలు సేకరించారు. నేరస్థులను గుర్తించి పట్టుకునేందుకు యత్నిస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో బైక్ దొంగతనాలు, సెల్ ఫోన్ చోరీలు సాధారణం అయ్యాయని బాధితులు వాపోతున్నారు. తాళాలు వేసిన ఇళ్లలో పగలు రాత్రి తేడా లేకుండా దొంగతనాలు జరుగుతున్నాయంటున్నారు. గత ఏడాది జిల్లాలో 17 చోరీలు పగటిపూట, 191 రాత్రి జరిగాయి. సాధారణ దొంగతనాలు 500కు పైగా జరిగినట్లు పోలీసుల వార్షిక నివేదిక వెల్లడించింది. గత జరిగిన వాటిలో 65 శాతం కేసులను పోలీసులు ఛేదించారు. 53 శాతం రికవరీ చేశారు. ఇదే సమయంలో ఏటీఎం దొంగలు పోలీసులకు సవాల్‌గా మారారు. చిన్న క్లూ కూడా దొరకకుండా దొంగలు జాగ్రత్త పడ్డారు. దీంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.