ఏపీలో లిక్కర్ పాలసీపై ఫోకస్ పెట్టింది సర్కార్. గత వైసీపీ సర్కార్ తీసుకువచ్చిన విధానాన్ని తొలగించి.. రాష్ట్రంలో 2019 కంటే ముందున్ విధానాన్నే మళ్లీ తీసుకురావాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే నూతన మద్యం విధానం రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఐదుగురు మంత్రులతో కూడిన ఈ కమిటీలో కొల్లురవీంద్ర, గొట్టిపాటి రవికుమార్, సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్‌ను కమిటీ సభ్యులుగా నియమించింది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న మద్యం విధానంపై ఈ కమిటీ సమీక్షించనుంది. అలాగే వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం విధానాలపై అధ్యయనం చేయనుంది. వివిధ వర్గాల అభిప్రాయాలు కూడా సేకరించనుంది. అలాగే ఇప్పటికే అధికారులు ఇచ్చిన నివేదికను సబ్‌కమిటీ పరిశీలించనుంది.
తెలంగాణలో ప్రస్తుతం అమలవుతున్న విధానంలో కొన్ని మార్పులు చేసి.. ఏపీలో నూతన పాలసీని ప్రవేశపెట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మద్యం రిటైల్ వ్యాపారాన్ని ప్రభుత్వం ప్రైవేటుకే అప్పగించనుంది. ఒక వ్యక్తి నుంచి ఎన్ని షాపులకైనా దరఖాస్తులు స్వీకరించాలని.. వచ్చిన దరఖాస్తులను లాటరీ తీసి లైసెన్సులు కేటాయించాలనే ఆలోచనలోఉన్నట్టు తెలుస్తోంది. ఈ మద్యం పాలసీ, టెండర్లకు సంబంధించి ఒక్కో దరఖాస్తుకు 2 లక్షల రూపాయల నాన్ రిఫండబుల్ రుసుము విధించాలని భావిస్తోందట ఎక్సైజ్ శాఖ. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ అధికారులు రాజస్థాన్, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని మద్యం విధానాలను అధ్యయనం చేశారు. ఈ మేరకు వారు సమర్పించిన నివేదికలు, కన్సల్టెన్సీ టీమ్ ఇచ్చిన నివేదికలను పరిశీలించిన ఎక్సైజ్ శాఖ.. వాటిలో తెలంగాణ విధానమే ఏపీకి అనువుగా ఉంటుందని ప్రాథమికంగా నిర్ణయానికొచ్చి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం.