విశ్వంలో సంగీత రంగాన పరిచయం అక్కరలేని వ్యక్తుల జాబితా తయారు చేస్తే.. అందులో అగ్రభాగాన ఉండే మహనీయుడు, గాన గంధర్వ సార్వభౌముడు ఘంటసాల వెంకటేశ్వరరావు. కంచు కంఠంతో…ఎన్నో మంచి మంచి పాటలు శ్రావ్యంగా పాడి శ్రోతలను రంజింప చేసిన గాన మాంత్రికుడు ఘంటసాల. కూటికి లేని పేదరికం నుంచి కోట్ల కు పడగలెత్తే పెద్దరికానికి చేరిన ఘంటసాల.. చివరకు పేదలపక్షంలోకే చేరి..ఆన్సర్ లేని క్యాన్సర్ బారిన పడి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. సహృదయశీలి, కరుణా సముద్రుడు, దైవభక్తాగ్రేసరుడు.. ఘంటసాలపై ఆ క్యాన్సర్ మహమ్మారి దండయాత్ర సాగిస్తున్నా…మంచానికే శరణ్యం అయినా…..తన గానకళా కౌశలంతో న భూతో, న భవిష్యతి అనే రీతిలో అద్భుతంగా భగవద్గీతను శ్లోక, తాత్పర్యంగా గానం చేశారు. భగవద్గీతలో లేని విషయం ఎక్కడా ఉండదని పెద్దలు చెబుతారు. ఎవరు ఎలా ఉండాలో, ఎవరు ఎలా ఉండకూడదో…మొత్తం జీవనసారాన్ని తెలియజేసే గీతాచార్యుని భగవగ్దీతను గానాచార్యుడు ఘంటసాల..శరీరక అనారోగ్యంతో మంచంపట్టిన సమయంలో..మంచంపై ఉండే.. గానం చేశారు. మహమ్మారి రోగాన్ని ఏ మాత్రం ఖాతరు చేయకుండా మహోన్నతంగా, మహత్తర భగవద్గీతను, మహిమాన్విత గానంతో.. కించిత్ ఆత్రం లేకుండా, సంపూర్ణ గాత్రశుద్ధితో ఆలపించడం…యావత్ సృష్టిలో ఎవరికీ సాధ్యం కాదంటే అతిశయోక్తి కాదేమో.
నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది…ఘంటసాల విషయంలో ఇది అసలు సిసలు నిజమే. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే. ఇదీ ఘంటసాలకు వర్తించేదే. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూ హించెదరు, విధివిధానమును తప్పించుటకు ఎవరు సాహసించెదరూ.. పేద విప్ర కుటుంబలో పుట్టి పూట గడవని పరిస్థితి నుంచి పది మంది.. కాదు కాదు.. వందలు, వేల మందికి కడుపు నిండా భోజనం పెట్టేస్థితికి, ఎందరో మట్టిలో మాణిక్య గాయకులను అక్కున చేర్చుకుని అందలం ఎక్కిస్తారని, దాన ధర్మాల్లో కర్ణుని సరసన చేరుతారని, చివరి కాలంలో శారీరక, మానసిక ఆందోళనలు మీద పడినా… గానకళామ తల్లి సేవలోనే తరించి తనువు చాలిస్తారని..ఏ క్షణంలోనైనా ఎవరైనా అనుకున్నారా.. విధిరాత ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించగలరా….దేవ దేవ ధవళా చల గంగాధరా అన్నా నారాయణ హరి నమో నమో అంటూ ఏ దైవగానం చేసినా, తెలుగు వీర లేవరా.. అంటూ స్వాతంత్ర్య భక్తిగీతం ఆలపించినా, లలిత సంగీతమైనా, సాధారణ చిత్ర గీతమైనా… ఏ పాట పాడాలన్నా, ఏ చిత్రానికి సంగీతం సమకూర్చాలన్నా ఘంటసాల అగ్రస్థానంలో ఉండేవారు.
మహదానందం కల్గించే ఎన్నో చిత్రగీతాలు గానం చేసిన ఘంటసాల వెంకటేశ్వరరావు.. సంగీత దర్శకత్వంలోనూ ఘనాపాటీగా పేరు పొందారు. ఆయన మ్యూజిక్ అందించిన దాదాపు అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్టే. పౌరాణిక చిత్రాల విషయానికి వస్తే.. న భూతో, న భవిష్యతిగా నిలిచిన లవకుశ, బంపర్ హిట్టయిన పాండవ వనవాసం చిత్రాలకు ఘంటసాలే సంగీత దర్శకత్వం వహించారు. అయిదేళ్లపాటు తీసిన లవకుశ సినిమా ఆ రోజుల్లోనే రెండేళ్ల పాటు ధియేటర్లలో ఆడిందంటే..ఆ సినిమాను ఎంత గొప్పగా తీశారో అర్థం చేసుకోవచ్చు. ఆ సినిమా చూస్తే..త్రేతాయుగంలోనే ఉన్నట్టు అన్పిస్తుంది. అంత గొప్పగా ఆ చిత్రంలో సెట్టింగులు ఉంటాయి. దశాబ్దాలు గడుస్తున్నా ఈ సినిమాలో పాటలు, పద్యాలు నిత్యసత్యంగా విరాజిల్లుతున్నాయి. పాండవ వనవాసంలో…ధారుణి రాజ్య సంపద, కురువృద్దుల్ వృద్ద బాంధవులు.. అనే పద్యాలు వింటుంటే.. వహ్వ.. వహ్వ.. ఆహా, ఆహా అని ఎవరైనా అనక మానరు. పరమానందయ్య శిష్యుల కథలో… వందే శంభు ఉమాపతిం.. అంటూ ఘంటసాల ప్రార్థనా గీతం కైలాసంలో శివుని ఎదుట పూజచేసిన అనుభూతి కలుగుతుంది.
ఘంటసాల దర్శకత్వం వహించిన కొన్ని టాప్ హిట్ మూవీలను చూస్తే.. కీలుగుర్రం, బాలరాజు, పాతాళ భైరవి, చిరంజీవులు, రక్త సంబంధం, రామ రాజ్యం, రామాలయం, గోవుల గోపన్న, మాయా బజార్ ప్రముఖంగా కనిపిస్తాయి. అంతేనా.. గుండమ్మ కథ, దీపావళి, అందమే ఆనందం, నిర్దోషి, భువన సుందరి కధ, పెళ్లినాటి ప్రమాణాలు… తదితర సినిమాలు తమ మాటో అని ముందుకొస్తాయి. ఇంకా ఎన్నో ఎన్నెన్నో గొప్ప హిట్ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు.
యాభై ఒక్క ఏళ్లకే వయస్సుకే తనువు చాలించిన ఘంటసాల దాదాపు పదివేల పాటలను పాడారు. ఇందులో దాదాపు అన్ని పాటలు హిట్టే. కొన్ని సూపర్ డూపర్ హిట్లే. ప్లాఫ్ పాటలు ఏవో వేళ్లమీద లెక్కించుకునేవే ఉంటాయి. నిర్దిష్ట సాహిత్యపర రచనా రాగాలకు నిబద్ధితమైన శాస్త్రీయ సంగీతం ఉంటుంది. అనంతమైన ఈ రాగాలు పాడే గాన గంధర్వులను బట్టి మహత్తరంగా మారుతూ ఉంటాయి. ఘంటసాలకు ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. 1970లో అతనికి పద్మశ్రీ అవార్డు లభించింది. అయితే, ఇంకెన్నో ఉత్తమ అవార్డులు ఆయనకు వచ్చివుండే బాగుండేదని అని ఆయన అభిమానలు అంటూ ఉంటారు. 1971లో ఐరోపా, అమెరికాలో ఆయన ప్రదర్శనలు ఇచ్చి సంగీత ప్రియులను రంజింపచేసారు.ఘంటసాల గౌరవార్థం ఎప్పుడో తపాలాబిళ్ల విడుదల చేశారు. ఇది ప్రశంసనీయం. విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం వద్ద, నెల్లూరు శ్రీకస్తూరిబా కళాక్షేత్రంలో ఘంటశాల విగ్రహాలు ఏర్పాటు చేయడం మరింత అభినందనీయం.
ఇక గానకళా కోవిదుడు ఘంటసాల జీవన ఘట్టాలు పరిశీలిస్తే…. 1922 డిసెంబర్ 4 న అప్పటి కృష్ణా జిల్లా, గుడివాడ సమీపంలోని చౌటపల్లి గ్రామంలో ఘంటసాల వెంకటేశ్వరరావు జన్మించారు. ఘంటసాలకు ఇద్దరు సతీమణులు, తొలి భార్య సావిత్రమ్మ కాగా రెండో భార్య సరళా దేవి. వీరికి నలుగురు కుమారులు విజయకుమార్, రత్నకుమార్, శంకర్ కుమార్, రవికుమార్, కుమార్తెలు శ్యామల, సుగుణ, మీరా, శాంతి. కాగా ఘంటసాల తల్లిదండ్రులు రత్నమ్మ, సూర్యనారాయణ. జన్మతః సంక్రమించిన గంభీర స్వరంతో ఘంటసాల సాలూరు చిన గురువుగా పేరొందిన పట్రాయని సీతారామశాస్త్రి వద్ద క్షుణ్ణంగా శాస్త్రీయ సంగీత శిక్షణ పొందారు. తొలితరం సినీ నేపథ్యగాయకులలో ప్రముఖులుగా పేరొందిన ఘంటసాల.. తమ అమూల్య వ్యాఖ్యానంతో ఆలపించిన భగవద్గీత విశ్వవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందింది.
1969 నుంచి ఘంటసాల ఆరోగ్యం క్షీణించడం మొదలెట్టింది. 1972లో రవీంద్రభారతిలో ప్రదర్శన ఇస్తున్నప్పుడు ఘంటసాలకు గుండెనొప్పి రావడంతో హాస్పిటల్లో చేర్చారు. అప్పటికే మధుమేహంతో బాధపడుతున్న ఆయన చాలారోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. 1973లో భక్తతుకారాం, దేవుడు చేసిన మనుషులు, జీవన తరంగాలు తదితర సినిమాల్లో పాడిన పాటలు అన్ని హిట్టయ్యాయి. జీవన తరంగాలలో… ఈ జీవన తరంగాలలో..ఎవరికి ఎవరు సొంతము, ఎంత వరకీ బంధం అనే వేధాంత ధోరణి పాట తెలుగు చలన చిత్రరంగంలోనే సూపర్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. అనంతరం 1974 నాటికి ఘంటసాల ఆరోగ్యం మరింత తిరోగమన దశకు చేరింది. 1974 ఫిబ్రవరి 11న గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు కంచు కంఠం మూగబోయింది. ఆ గాన సార్వభౌముడు దైవైక్యం చెందారు.