హైదరాబాద్ సరూర్ నగర్‌లో రౌడీ షీటర్లు హంగామా సృష్టించారు. రెస్టారెంట్‌లో బిల్లు కట్టమన్నందుకు యాజమాన్యం, సిబ్బందిపై కత్తులు, కర్రలతో దాడికి తెగబడ్డారు. రౌడీషీటర్ల దాడిలో రెస్టారెంట్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలంలో ఉన్నప్పటికీ దుండగులు మూకుమ్మడి దాడి చేశారు. ఈ ఘటనపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధాన నిందితుల్లో ఏదుల ప్రసన్ రెడ్డి, ఏదుల యశ్వంత్ రెడ్డి, వారి అనుచరులపై నేరచరిత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. గతంలో వనస్థలిపురంలో సొంత అక్క భర్తను ప్రసన్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. నిందితుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.


