తెలంగాణ ఎన్నికల్లో తాము ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలకు సంబంధించి పోస్టర్లను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఢిల్లీలో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని.. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలను తాము నెరవేర్చుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 55 వేల ఉద్యోగాలు కల్పించామన్న సీఎం రేవంత్… ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వాలని రేవంత్‌రెడ్డి కోరారు.