సీఎం రేవంత్ రెడ్డి తెస్తున్న పెట్టుబడులు బూటకమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటనలతో పెట్టుబడులు రాబోతున్నాయని ప్రచారం చేస్తున్నారని.. గతంలో అమెరికా ,దావోస్ పర్యటనలతో పెట్టుబడులు తెచ్చామని అసత్య ప్రచారం చేశారని అన్నారు. ముఖ్యమంత్రిగా తనను గుర్తించడం కోసమే రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు.
“పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న విధంగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉంది. ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారు. గత సంవత్సరం దావోస్ పర్యటనకు వెళ్లి 40 వేల 232 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చామని అన్నారు. ప్రజలను మోసం చేయడం రేవంత్ రెడ్డి నైజం. రేవంత్ రెడ్డి పెట్టుబడుల ప్రకటనలు బూటకం. రేవంత్ రెడ్డి తెచ్చిన పెట్టుబడులు ఫేక్ పెట్టుబడులు.
అదానీ కంపెనీ నుండి 12 వేల కోట్ల పెట్టుబడులు అన్నారు. బిఆర్ఎస్ హయాంలో కేటీఆర్ ఎంఓయూ కుదుర్చుకున్న పెట్టుబడులను రేవంత్ రెడ్డి తెచ్చినట్లుగా చెప్పారు. రేవంత్ రెడ్డి తెచ్చిన పెట్టుబడులు కేవలం రూ.862 కోట్లు మాత్రమే. బిఆర్ఎస్ హయాంలోనే రూ.14,500 కోట్లు పెట్టుబడుల కోసం అంగీకారం కుదిరింది.
రేవంత్ రెడ్డి నిర్ణయాలతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది. రేవంత్ రెడ్డి పర్యటనలతో రూపాయి లాభం లేదు. సీఎం రేవంత్ రెడ్డి తీరు వింతగా అనిపిస్తోంది. ఫార్మా సిటీ, ఎయిర్ పోర్ట్ మెట్రో, ఫార్ములా ఈ రేస్ రద్దు చేస్తూ రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకున్నారు. కేసీఆర్ ఆనవాళ్లు చేరిపివేస్తానని రేవంత్ రెడ్డి తెలంగాణకు నష్టం చేస్తున్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. రాష్ట్రం నుండి కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయి. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం కలుగుతోంది. రేవంత్ రెడ్డి విధానాలు పెట్టుబడిదారులను భయపెట్టే విధంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి తెలంగాణను క్యాన్సర్
పేషేంట్ తో పోల్చారు. ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధులను రేవంత్ రెడ్డి బెదిరించారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం అని మోసం చేశారు.
దేవుళ్లపై ప్రమాణం చేసి రుణమాఫీ అని రైతులను మోసం చేశారు. వందల కోట్ల రూపాయలతో యాడ్స్ ఇస్తున్నారు. ఏడాది పాలన సంబరాలకు కోట్ల రూపాయలు వృధా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడులు బూటకం అని బిఆర్ఎస్ నిరూపించింది” .. అని వివేకానంద గౌడ్ అన్నారు.