తెలంగాణలో బీర్ల సరఫరాను పునరుద్ధరించినట్టు యూబీఎల్ సంస్థ ప్రకటించింది. బీర్ల ధరల పెంపు, పాత బకాయిల విడుదలపై తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ సానుకూలంగా స్పందించింది. త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బీర్ల సరఫరా పునరుద్ధరణ చేస్తున్నట్లు యూబీఎల్ ప్రకటించింది. వినియోగదారులు, కార్మికులు, వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా మధ్యంతర నిర్ణయం తీసుకున్నామని సంస్థ తెలిపింది.
రాష్ట్రంలో యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ అతిపెద్ద బీర్ల తయారీ సంస్థ. ఆరు బీర్ల తయారీ సంస్థలున్నా మార్కెట్లోకి వచ్చే వాటాలో 75శాతం వాటా యూబీఎల్‌దే.
బీర్ల ధరలను పెంచాలని, గత రెండేళ్ల నుంచి ఉన్న రూ.702 కోట్ల బకాయిల్ని కార్పొరేషన్ వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఈనెల 9న యూబీఎల్ లేఖ రాసింది. టీజీబీసీఎల్‌కు సరుకు సరఫరా చేయలేమని లేఖలో స్పష్టం చేసింది. బీరు మూల ధరను సవరించాలని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడం వల్ల బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.