కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఏరో ఇండియా-2025లో యుద్ధ విమానాన్ని నడిపారు. యుద్ధ విమానాన్ని నడపడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. HAL స్వదేశంలో తయారు చేసిన HJT-36 యశప్ అనే జెట్ విమానంలో ప్రయాణించే అవకాశం లభించిందని చెప్పారు. విమానయాన, రక్షణ తయారీలో రోజురోజుకూ పెరుగుతున్న భారత శక్తికి స్వదేశీ పరిజ్ఞానం నిదర్శనమని ట్వీట్‌లో తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో కొత్త శిఖరాలకు చేరుకోవడం ఆనందంగా ఉందని రామ్మోహన్ నాయుడు ఎక్స్ వేదికగా తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా మన దేశంలో కొత్త పరికరాల తయారీయే కాకుండా ప్రపంచం కోసం తయారుచేయాలనే పిలుపును అందిపుచ్చుకున్న రక్షణరంగం- అత్యాధునిక సామర్థ్యాలతో భావి సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. కర్ణాటకలో యలహంకలోని వైమానిక కేంద్రంలో జరుగుతోన్న 15వ ఏరో ఇండియా ప్రదర్శన వీటన్నింటికీ వేదికగా నిలిచింది.
ప్రస్తుతం ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్‌లో 13 మంది మహిళలు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. రిమోట్లీ పైలటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్ ఆపరేషన్లలో 8 మంది, వివిధ ఆర్మీ ఏవియేషన్ స్వ్కాడ్రన్‌లలో 9 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే యుద్ధరంగంలోనూ వారిని మోహరిస్తున్నారు. వారి సామర్థ్యాన్ని గుర్తించిన భారత సైన్యం.. మహిళా అధికారులకు సాధికారత కల్పించడానికి కట్టుబడి ఉంది.